Hyderabad Metro: విశ్వనగరం హైదరాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. 11 రోజులు భక్తుల పూజలందుకున్న గణనాథలు మంగళవారం గంగమ్మ ఒడికి తరలనున్నారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వేడుకలు చూసేందుకు నగరవాసులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు, భక్తుల సౌకర్యార్తం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా శోభాయాత్ర సాగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమర్చారు. శోభాయాత్ర సాగే రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మహాగణపతి నిమజ్జనం ముగిసేలా చూస్తారు. దీంతో నిమజ్జనం ముగిసినట్లుగా భావిస్తారు.
అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో..
వినాయక నిమజ్జనం సందర్భంగా వేడులను తిలకించేందుకు లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో సర్వీస్‌లను అర్ధరాత్రి 2 గంటల వరకు నడపాలని ఎల్‌అండ్‌టీ నిర్ణయించింది. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది. నగరంలోని చివరి స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయల్దేరుతుందని వెల్లడించింది. ఆదివారం సెలవు రోజు కావడంతో మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆదివారం ఒక్కరోజే 94 వేల మంది మెట్రోలో ప్రయాణించారు. నిమజ్జనం రోజు ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా వేస్తున్నారు.
600 ఆర్టీసీ బస్సులు..
ఇక ఆర్టీసీ కూడా వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్వహించింది. అన్ని రూట్ల నుంచి ట్యాంక్ బండ్‌కు 600 సర్వీస్‌లు నడుపుతామని ఎండీ సజ్జనార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. అర్ధరాత్రి వరకు 20 ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతామని ప్రకటించింది. మొత్తంగా గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులు రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం, రైల్వే శాఖ, మెట్రో సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.