https://oktelugu.com/

Telangana HYDRA : హైడ్రా దూకుడు.. రేవంత్ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారుతోందా?

హైదరాబాద్ నగరంలోని చెరువులు, నీటి వనరులు, జలాశయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ కొనసాగుతున్నారు. హైడ్రాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వడంతో దూకుడు కొనసాగిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 25, 2024 / 03:56 PM IST

    Telangana HYDRA

    Follow us on

    Telangana HYDRA :  హైదరాబాదు నగరంలోని ప్రముఖ చెరువులను ఆక్రమించి నిర్మించిన భవనాలను పడగొడుతోంది. సినీ నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి మొదలుపెడితే కావూరి హిల్స్ వరకు ప్రతిదానిని నేలమట్టం చేసింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏ స్థాయిలో అయితే ప్రశంసలు లభించాయో.. గడచిన ఆదివారం అమీన్ పూర్ చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలను పడగొడితే అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. అయితే ఇక్కడ హైడ్రా దూకుడు వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ” అమ్మిన వాళ్లు బాగున్నారు. రిజిస్ట్రేషన్ నుంచి మొదలు పెడితే ఇతర వ్యవహారాల వరకు చేసిన అధికారులు కూడా బాగానే ఉన్నారు. కానీ ఆ స్థలాలు కొనుగోలు చేసి.. భవనాలు నిర్మించిన తామే నష్టపోతున్నామని” బాధితులు అంటున్నారు. ఇళ్లను పడగొట్టిన తర్వాత బాధితుల ఆక్రందన సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. తాము ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నప్పటికీ.. బయట వేరేతిరిగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికారుల వ్యవహార శైలి ప్రముఖంగా చర్చకు దారి తీస్తోంది. ఇళ్లు నిర్మించుకోవడానికి కావలసిన అనుమతులు.. ఇతర ప్రక్రియలు మొత్తం అధికారులు చేపడుతున్నారు. కానీ ఆ నిర్మాణాలు చెరువుల పరిధిలో ఉన్నాయని, నీటి కుంటలను ఆక్రమించి కట్టారని.. బఫర్ జోన్ నిబంధనలను అతిక్రమించారని హైడ్రా చెబుతోంది. అందువల్లే ఆ నిర్మాణాలను పడగొడుతోంది.

    ప్రభుత్వానికి ప్రతిబంధకం

    ఊహించినట్టుగానే హైడ్రా వ్యవహార శైలిని ప్రారంభించి భారత రాష్ట్ర సమితి తప్పుపడుతోంది. ఈ భవనాలను కూల్చే దమ్ము ఉందా అంటూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు గండిపేట చెరువును ఆనుకొని నిర్మించిన భవనాలను చూపించింది. తన సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఆ వివరాలను ప్రచురించింది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. మరోవైపు రేవంత్ రెడ్డి సోదరుడు దుర్గం చెరువు సమీపంలో నిర్మించిన ఇంటికి ఆ మధ్య నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ సొసైటీ పరిధిలో ఉన్న వారంతా కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆ నిర్మాణాలను కూల్చకుండా స్టే ఇచ్చింది. ఇది భారత రాష్ట్ర సమితికి వరంలాగా మారింది. రేవంత సోదరుడు సేఫ్ అయ్యాడని.. కానీ పేదలు మాత్రం ఇళ్లను కోల్పోయి రోడ్డు మీద పడ్డారని నమస్తే తెలంగాణ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అయితే ఇదే సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కేటీఆర్ స్నేహితుడు కోర్టుకు వెళ్లిన విషయాన్ని మాత్రం నమస్తే తెలంగాణ ప్రస్తావించడం విస్మరించింది. ఒక రకంగా రేవంత్ చేస్తున్నది మంచి పని అయినప్పటికీ.. అందులో మంచిని కాస్త పక్కన పెట్టి.. పడగొట్టిన నిర్మాణాలు.. బాధితుల కన్నీళ్లను మాత్రమే భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం తెగ ప్రచారం చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా విఫలమవుతున్నాయి. అయితే హైడ్రా సాగిస్తున్న దూకుడు రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని వాదనలు వినిపిస్తున్నాయి. గడచిన ఆదివారం హైడ్రా కొన్ని భవనాలను కూల్చివేసింది. అయితే ఇలాంటి సమయంలో హైడ్రా తన వ్యవహార శైలి మార్చవలసిన అవసరం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. ముందుగా ఎక్కడ భవనాలను కూల్చాలనుకుంటున్నారు? వారు ఎలా నష్టపోయారు? ఎవరు వారిని మోసం చేశారు? ఇందులో ప్రభుత్వపరంగా వారికి పరిహారం ఇచ్చే అవకాశం ఉందా? అనే విషయాలను పరిశీలించి.. వాటిని అమలు చేసిన తర్వాత.. ఆ నిర్మాణాలను పడగొడితే నుంచి వ్యతిరేకత రాదు. పైగా ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది.

    మూసి విధానాన్ని కొనసాగిస్తేనే బెటర్..

    ఇటీవల మూసి ప్రక్షాళనకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దిశగానే ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మూసి నదిని ఆక్రమించిన వారి ఇళ్ళను తొలగించి.. పరిహారం ఇస్తామని రేవంత్ చెప్పారు. మూసి ఆక్రమణలో పెద్ద పెద్ద వ్యక్తుల కంటే పేదలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం భావిస్తోంది. వారికి అనేక మార్గాలలో ప్రత్యామ్నాయాలు చూపించిన తర్వాత.. ప్రక్షాళన మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే విధానాన్ని హైడ్రాకు వర్తింపజేస్తే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. అప్పుడు హైడ్రా వ్యవస్థకు ప్రజల నుంచి నూటికి నూరు శాతం మద్దతు లభించే అవకాశం లేకపోలేదు.