హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆదివారం ప్రారంభమైన ఆషాఢ బోనాలు ఆగస్టు 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సుమారు600 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. జులై 25,26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు, ఆగస్టు 1,2 తేదీల్లో ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాలు జరగనున్నాయి.
ఆగస్టు 8న గోల్కొండలోనే ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికి బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి పట్టు బట్టలు సమర్పించారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
గోల్కొండ లోని జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించడంతోపాటు ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ కు ప్రతీకగా నిలుస్తాయని సీఎం తెలిపారు. అమ్మవారి దీవెనతో ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ర్టం దేశానికే భోజనంపెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం నిలవాలని ప్రార్థించారు.