హుజురాబాద్ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈటలను దెబ్బకొట్టాలని భావించి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీలో ఉండగా టీజేఎస్ సైతం పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అధికార పార్టీ మాత్రం ఎల్. రమణను పోటీలో దింపాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించడంతో ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈటల బీసీ కావడంతో ఆయనను ఎధుర్కోవడానికి బీసీ అయితేనే బాగుంటుందని భావించి ఎల్ రమణకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణలు, విజయావకాశాలు పరిగణనలోకి తీసుకుని రమణ అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హుజురాబాద్ లో బీసీలే ఎక్కువగా ఉండడంతో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రమణను బరిలో దించుతున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసినందుకు రమణకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన పోటీ చేసి గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈటలను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఒక వేళ పోటీ చేసి ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండు మూడు రోజుల్లో రమణ గులాబీ కండువా వేసుకోనున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ సీటు దక్కించుకోవడం అధికారపార్టీకి ప్రతిష్టాత్మకం. ఈటల రాజేందర్ ను ఓడించాలని కంకణం కట్టుకుంది. అందుకే రమణను పార్టీలోకి ఆహ్వానించి పోటీకి దింపుతున్నారు. పోటీ చేసి గెలిచినా ఓడినా పదవి ఇస్తామని భరోసా కల్పించి పోటీకి సంసిద్ధం చేస్తున్నారు. మంత్రివర్గంలోకి వచ్చేందుకు రమణ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అధికార పార్టీ టీఆర్ఎస్ హుజురాబాద్ ఉప ఎన్నికపై ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. రూ.వందల కోట్ల పనులు చేసేందుకు నిధులు విడుదల చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడిపోయింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు అక్కడే మకాం వేసి తిరుగుతున్నారు. నియోజకవర్గమంతా జల్లెడ పట్టి పార్టీ గెలుపును సునాయాసం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే పలు వ్యూహాలు ఖరారు చేస్తోంది. అధికారమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది.