Hydra : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర భద్రతను, పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన హైడ్రా సంచలనంగా మారింది. ఈ వ్యవస్థ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. ఈ క్రమంలో హైడ్రా చేస్తున్న పనులు సంచలనంగా మారాయి. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను పడగొట్టిన తర్వాత హైడ్రా చేపడుతున్న ఆపరేషన్లు సంచలనంగా మారాయి. రంగనాథ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హైడ్రా ను.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
జూన్ 27 నుంచి..
హైదరాబాద్ నగరంలో జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కూల్చివేతలకు సంబంధించిన వివరాలను ఆయన అందులో పొందుపరిచారు. ఇప్పటివరకు 18 ప్రాంతాలలో 166 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్టు ప్రకటించింది. ఈ ప్రకారం కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంది. చెరువుల ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్లతోపాటు పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నట్టు హైడ్రా ప్రభుత్వానికి వెల్లడించింది. అధికార, విపక్ష పార్టీలు అని లేదు.. ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవడమే..
చింతల్ చెరువులో భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు రత్నకరం సాయిరాజు అక్రమంగా 54 నిర్మాణాలను నిర్మించగా.. వాటిని మొత్తం పడగొట్టింది. మూడు ఎకరాల ఐదు గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
నందగిరి హిల్స్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోద్బలంతో కొందరు పార్క్ ఆక్రమించారు. వారి నుంచి 18 గుంటల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
బహదూర్పురాలో ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రాజేంద్రనగర్ లోని బుము రౌఖ్ చౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన రెండు ఐదు అంతస్తుల భవనాలు, ఒకటి రెండు అంతస్తుల భవనాన్ని, మరో భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఈ ప్రాంతంలో మొత్తం 45 అక్రమ కట్టడాలను పడగొట్టి.. 12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది..
గండిపేట ఎఫ్ టీ ఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరి సీడ్స్ యజమాని జీవి భాస్కరరావు, మందని నుంచి పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ నిర్మించిన ఎనిమిది భవనాలను, 14 తాత్కాలిక షెడ్లను, నాలుగు ప్రహరీ గోడలను హైడ్రా కూల్చివేసింది.
ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్ టీ ఎల్ లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. మాదాపూర్ ప్రాంతంలోని తమ్మిడి కుంట చెరువులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోని రెండు నిర్మాణాలను పడగొట్టింది. ఇక్కడ హైడ్రా నాలుగు ఎకరాల తొమ్మిది గంటల భూమిని స్వాధీనం చేసుకుంది. అయితే హైడ్రా చేస్తున్న పనులపై రాష్ట్ర వ్యాప్తంగా సానుకూల దృక్పథం వ్యక్తం అవుతుండగా.. భారత రాష్ట్ర సమితి మాత్రం హైడ్రా పనితీరును తీవ్రంగా తప్పుపడుతోంది.