Kalvakuntla Kavitha : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఐదున్నర నెలులు తిహార్ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే అరెస్టు చేసిన ఈడీ.. తర్వాత ఢిల్లీకి తరలించి ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆదేశాల మేరకు తిహార్ జైలుకు తరలించింది. ఆ తర్వాత సీబీఐ ఏప్రిల్ 11న కవితను తిహార్ జైల్లోనే అరెస్టు చేసింది. నాటి నుంచి కవిత బెయిల్ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ప్రత్యేక కోర్టు, ఢిల్లీ హైకోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. దర్యాప్తు సంస్థల వినతి మేరకు బెయిల్ నిరాకరించాయి. దీంతో చివరి ప్రయత్నంగా కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‌పై మంగళవారం(ఆగస్టు 27న) విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.
కండీషన్స్ అప్లయ్..
కవితకు బెయిల్ మంజూరుచేసిన సుప్రీం ధర్మాసనం సీబీఐ, ఈడీ కేసులో రూ.10 లక్షల చొప్పున రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. పాస్‌పోర్టు సరెండర్ చేయాలని సూచించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని పేర్కొంది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కవిత సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కవితను జైలు నుంచి విడిపించేందుకు మిగతా ఫార్మాలిటీలు పూర్తి చేశారు. రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకున్నారు. అనంతరం ఉత్తర్వులను తీసుకుని తిహార్ జైలుకు వెళ్లారు.
9 గంటలకు విడుదల..
మంగళవారం(ఆగస్టు 27న) రాత్రి 9 గంటలకు కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తూనే కవిత పిడికిలి బిగిస్తూ బయటకు వచ్చారు. బయటకు రాగానే తన కొడుకును హత్తుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత జైలు బయట ఓపెన్ టాప్ కారులో నిలబడి అక్కడకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులు, మీడియాకు అభివాదం చేశారు. జై తెలంగాణ అని నినదించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
వడ్డీతో సహా చెల్లిస్తా..
18 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, అనేక ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నానని కవిత తెలిపారు. కానీ, బిడ్డలను వదిలి ఐదు నెలలు జైల్లో ఉండడం ఇబ్బందిగా అనిపించిందని భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తాను కేసీఆర్ కూతురునని తప్పు చేయనని స్పష్టం చేశారు. చేయని తప్పుకు తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తాననన్నారు. ఇక తన పోరాటం అన్ బ్రేకబుల్ అని స్పష్టం చేశారు. కష్ట సమయంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచిన వారికి పాదాభివందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.