CM Revanth Reddy : తెలంగాణ రాజధాన్ని హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో విశ్వనగరంగా అభివృద్ధి చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఇమేజ్ తెచ్చారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీ మినహా తెలంగాణ అంతటా ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇందుకు కారణం హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్ అభివృద్ధి చేయడమే కారణం. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 20 స్థానాల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్‌నే గెలిపించారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు. భాగ్యనగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు ఇందు కోసం హైడ్రాను ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ హైడ్రా ఇప్పటి వరకు 43 ఎకరాల ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే ప్రముఖ సినీ నటుడు నాగాజ్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చే వరకు హైడ్రా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణ అంతటా హైడ్రా గురించే చర్చ జరుగుతోంది.
2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం..
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ ఎన్ కన్వెన్షన్ యజమాని. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ రెవెన్యూ పరిధిలో దాదాపు 29.6 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది. ఇది ఆక్రమణలకు గురవుతూ రానురాను కుంచించుకుపోయినట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ చెబుతోంది. ఈ చెరువు పక్కనే సర్వే నంబర్ 11/2లో దాదాపు మూడు ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. ఏసీ ఫంక్షన్ హాల్, ఆఫీస్, డైమండ్ హాల్ సహా కొన్ని నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. దీని నిర్మాణంపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కానీ, అధికారులను మేనేజ్ చేసి నిర్మాణం పూర్తిచేశారు. 2015లో దీనిని ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్‌లో సెలబ్రిటీలు, వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన ఫంక్షన్లు జరుగుతాయి. దీని అద్దె రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నాగార్జున గడిచిన 9 ఏళ్లలో ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా 10 కోట్లకు పైగా సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్ కన్వెన్షన్‌లోనూ రేవంత్ కూతురు నిశ్చితార్థం..
ఇదిలా ఉంటే.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఏకైక కూతురు నైశిమారెడ్డి నిశ్చితార్థం 2015లో ఈ ఎన్ కన్వెన్షన్‌లోనే నిర్వహించారు. నాడు రేవంత్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. తమ కుటుంబ వేడుకగా నిర్వహించారు. ఇందుకు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌నే వేదికగా చేసుకున్నారు. ఈ వేడుక కోసం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా బెయిల్‌పై వచ్చారు. ఇక నాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెండు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.
నేడు అక్రమమని కూల్చివేత..
2015లో కూతురు నిశ్చితార్థం జరిగిన ఎన్ కన్వెన్షన్‌నే నేడు సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి అక్రమ నిర్మాణమని కూల్చివేయించారు. ఆక్రమణల తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. పూర్తిగా నేలమట్టం చేసింది. నాగార్జున కూల్చివేతపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునేలోగానే కూల్చివేత పూర్తి చేశారు. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ గ్రౌండ్ జీరో అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాడు రేవంత్‌రెడ్డి కూతురు నిశ్చితార్థం జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.