HomeతెలంగాణAds Staff: యాడ్స్ సిబ్బంది శ్రీలంక టూర్ కు.. రిపోర్టర్లు ఏం పాపం చేశారు సార్?...

Ads Staff: యాడ్స్ సిబ్బంది శ్రీలంక టూర్ కు.. రిపోర్టర్లు ఏం పాపం చేశారు సార్? ఇవేనా మీరు పాటించే విలువలు?

Ads Staff: గానుగెద్దు పొద్దంతా తిరుగుతుంది. సాయంత్రం పూట కాడి విడిచిన తర్వాత యజమాని దానికి వేరుశనగ చెక్క పెడతాడు. అది పూర్తి అయిన తర్వాత పచ్చిమేత వేస్తాడు. ఆ తర్వాత కుడిది పెట్టి వరిగడ్డి వేస్తాడు. ఎందుకంటే ఎద్దు బలంగా ఉంటేనే గానుగ సమర్థవంతంగా నడుస్తుంది. వేరుశనగ గింజల నుంచి నూనె బాగా వస్తుంది. తనకు కడుపునిండా తిండి పెడుతున్నాడు కాబట్టి ఎద్దు కూడా సక్రమంగా నడుస్తుంది. ఇదే థియరీ మనుషులకు కూడా వర్తిస్తుంది. ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు, భత్యాలు సక్రమంగా ఇచ్చి.. వారిని మంచిగా చూసుకుంటే యాజమాన్యంపై ఉద్యోగులకు ప్రేమ కలుగుతుంది. యాజమాన్యం కోసం ఉద్యోగులకు ఏదైనా చేయాలనిపిస్తుంది. కానీ పనిచేయని వారికి ఒక తీరుగా.. పనిచేస్తున్న వారిని ఒక తీరుగా చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఈ పత్రికలో చేస్తున్న సిబ్బంది లాగా ఉంటుంది.

Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!

ఆ పత్రికలో పనిచేసే రిపోర్టర్లకు గతంలో యాడ్స్ టార్గెట్స్ మాత్రమే ఉండేవి. సంవత్సర చందాలు ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే యాడ్స్ విభాగానికి ఓ పనికిమాలిన పత్రికలో పనిచేసిన వ్యక్తి వచ్చాడో.. అప్పుడే పరిస్థితి మొత్తం మారిపోయింది. అతడు చెప్పిన మాటలకు మేనేజ్మెంట్ వంతపాడటం మొదలైంది. పైగా ఆ పత్రిక అధిపతి కుమారుడు ఇటీవల కాలంలో మేనేజ్మెంట్ లోకి ప్రవేశించాడు. పత్రిక వ్యవహారాలను అతడే పరిశీలిస్తున్నాడు. దీంతో అతడిని కొత్తగా వచ్చిన యాడ్స్ విభాగాధిపతి మచ్చిక చేసుకున్నాడు. అంతేకాదు ఇదే అదునుగా యాడ్స్ విభాగ అధిపతి విలేకరులను విలేకరుల మాదిరిగా చూడకుండా.. కేవలం యాడ్స్ టార్గెట్ ఫినిష్ చేసే వ్యక్తులుగా మార్చాడు. దీనికి తోడు సంవత్సర చందాలు.. ఫలితంగా విలేకరులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఇంత ఇబ్బంది పడి పని చేయలేక చాలామంది విలేఖరులు వేరే మార్గాలు చూసుకున్నారు. ఇంకా కొంతమంది వేరే మార్గం చూసుకోలేక.. వేరే వాటిల్లో అవకాశాలు లేక ఇందులోనే ముక్కుతూ ములుగుతూ పని చేస్తున్నారు. ప్రతి ఏడాది పేపర్ చందాలు చేయడం.. వార్షికోత్సవానికి ప్రకటనలు చేయడం.. ఇదో ప్రహసనం అయిపోయింది ఆ పత్రికలో పనిచేస్తున్న విలేకరులకు.

ఇక ఇటీవల కాలంలో ఆ పత్రికాధిపతి జిల్లా కార్యాలయాలలో పర్యటించారు. మొహమాటం లేకుండా పత్రిక నెంబర్ వన్ స్థానంలో ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతే ఆ యాడ్స్ విభాగాధిపతి మరింత రెచ్చిపోయారు. ప్రతి యూనిట్ కు టార్గెట్లు పెట్టారు. అయితే ఆ స్థాయిలో టార్గెట్లు తాము చేయబోమని రిపోర్టర్లు తెగేసి చెప్పడంతో మేనేజ్మెంట్ కాస్త వెనుకడుగు వేసింది. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ సంవత్సర చందాలు చేయాలంటూ రిపోర్టర్లకు టార్గెట్లు విధించినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది రిపోర్టర్లు భారీగానే యాడ్స్ చేస్తుంటారు. ఒక్కో యూనిట్ లో దగ్గర దగ్గర కోటి రూపాయలు వరకు చేస్తుంటారు. ఇంత చేసినా సరే ఏదో ముష్టి వేసినట్టు మేనేజ్మెంట్ విలేకరులకు కమిషన్ ఇస్తుంది. ఉద్యోగాన్ని కాపాడుకోవడం.. సమాజంలో జర్నలిస్టు అనే హోదాను కొనసాగించడం కోసం చాలామంది విలేకరులు యాడ్స్ టార్గెట్ చేస్తుంటారు.

ఇక ఇటీవల కాలంలో యాడ్స్ టార్గెట్ పూర్తి చేసిన కొంతమంది మార్కెటింగ్ సిబ్బందిని శ్రీలంక తీసుకెళ్లారట. ఇప్పటికే ఒక విడతలో కొంతమందిని శ్రీలంక తీసుకెళ్లి వచ్చారట. ఇంకా రెండు విడతల్లో మిగతా వారిని కూడా తీసుకెళ్తారట. దీనిని తప్పు పట్టడానికి లేకపోయినప్పటికీ.. వాస్తవానికి ఆ పత్రికకు యాడ్స్ సిబ్బంది సేకరించే ప్రకటనల కంటే రిపోర్టర్లు తీసుకొచ్చే యాడ్సే ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి మేనేజ్మెంట్ ముఖ్యంగా యాడ్స్ విభాగపు అధిపతి.. తన విభాగంలో పనిచేసే సిబ్బందికే శ్రీలంకను దర్శించే భాగ్యం కల్పించడం విశేషం. అయితే దీనిపై రిపోర్టర్లు మండిపడుతున్నారు. “ప్రతి ఏడాది పత్రికకు సంవత్సర చందాలు తీసుకొస్తున్నాం. ప్రకటనలు కూడా తీసుకొస్తున్నాం. చెప్పుకునే స్థాయిలో జీతాలు లేకపోయినా పనిచేస్తున్నాం. ఇలాంటి స్థితిలో కూడా మేము చేస్తున్న సేవలను గుర్తించకుండా..అంతంత మాత్రం పని చేసే వారిని శ్రీలంక తీసుకెళ్లడం ఏంటి.. అలాంటప్పుడు వారితోనే వార్షికోత్సవ ప్రకటనలు చేయిస్తే సరిపోతుంది కదా” అంటూ విలేకరులు వాపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular