Rain Alert: పది రోజులుగా భారీ ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. సోమవారం(మే 6వ) నుంచి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఆదివారం మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెల్లడించింది.
శనివారం మండిన సూర్యుడు..
శనివారం(మే 4న) భానుడు భగ్గుమన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం నుంచి ఎల్లో అలర్ట్..
మండుతున్న ఎండలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెండ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 7, 8 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య జనం బయటకు రావొద్దని సూచించింది.
జగిత్యాల జిల్లాలో అత్యధికం..
ఇక రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులుగా చాలా మండలాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం కూడా టెంపరేచర్ 46 డిగ్రీలు దాటింది. ఎండ వేడిక రోడ్లు బోసిపోతున్నాయి. ప్రజలు వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. కరీంనగర్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాలతోపాటు జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, జిల్లాల్లోనూ 46 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.