Terrorists Attack: పార్లమెంట్ ఎన్నికలవేళ.. ఉగ్రదాడి.. జమ్మూ కాశ్మీర్ లో కలకలం

కార్డెన్ సెర్చ్ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత వైమానిక దళం కాన్వాయ్ పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా స్థానికంగా ఉన్న ఉదంపూర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 5, 2024 8:39 am

Terrorists Attack

Follow us on

Terrorists Attack: పార్లమెంట్ ఎన్నికలవేళ.. అత్యంత సున్నిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) వాహన శ్రేణిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు దుర్మరణం చెందాడు. మరో నలుగురు సైనికులు గాయపడ్డారు.. ఈ ఏడాది రాజౌరీ – పూంచ్ పరిధిలో ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. గత నెలలో ఉగ్రవాదులు జరిపిన వేరువేరు దాడుల్లో ఆర్మీ జవాన్ సోదరుడిని, విలేజ్ డిఫెన్స్ గ్రూప్ సభ్యుడిని కాల్చి చంపారు. పూంచ్ జిల్లాలోని షాసితార్ ప్రాంతంలో సోదాలు నిర్వహించి వస్తున్న భారత వైమానిక దళం వాహనాలపై ఉగ్రవాదులు అత్యంత తెలివిగా దాడులు జరిపారు. కొంతకాలంగా ఈ ప్రాంతంలో భారత వైమానిక దళం అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు సాగుతున్నాయనే అనుమానంతో వారు ఈ కార్డెన్ సెర్చ్ చేస్తున్నారు.

కార్డెన్ సెర్చ్ నేపథ్యంలో ఉగ్రవాదులు భారత వైమానిక దళం కాన్వాయ్ పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా స్థానికంగా ఉన్న ఉదంపూర్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మిగతా నలుగురికి బుల్లెట్ గాయాలు కావడంతో.. వారు ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రానికి చాలా దగ్గరలో దూరంలో ఉంది. దీంతో ఆర్మీ అధికారులు అప్పటికప్పుడు అప్రమత్తమై, హెలికాప్టర్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించారు.

2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాను రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 220 కిలోమీటర్ల నియంత్రణ రేఖను పంచుకునే పూంచ్ – రాజౌరీ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు వేరువేరు దాడుల్లో ఆర్మీ జవాన్ సోదరుడిని, విలేజ్ డిఫెన్స్ గ్రూప్ సభ్యుడిని కాల్చి చంపారు. పీర్ పంజాల్ లోయలోని పూంచ్ – రాజౌరీ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగింది. మే 25న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దాడుల నేపథ్యంలో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. వాహన తనిఖీలను, సోదాలను ముమ్మరం చేశాయి.