https://oktelugu.com/

Bijnor: రైలు బండి కాదు మొండి ఇది.. జర సాయం పట్టండి.. వీడియో వైరల్

అప్పట్లో మురళీమోహన్ హీరోగా రూపొందించిన ఓ చిత్రంలో "బండి కాదు మొండి ఇది.. సాయం పట్టండి.. పెట్రోల్ ధర మండుతుంది.. ఎడ్లు కట్టండి" ఓ పాట ఉండేది.. గుర్తుందా.. అలాంటి సన్నివేశమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. కాకపోతే అక్కడ కారు.. ఇక్కడ రైలు.. మిగతాది మొత్తం సేమ్ టు సేమ్..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 17, 2024 9:31 am
    Bijnor

    Bijnor

    Follow us on

    Bijnor: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బరేలి లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది పలు రైళ్ల రాకపోకలకు కీలక మార్గం. అయితే ఈ స్టేషన్లోని పట్టాలపై ఒక రైలు ఆగిపోయింది. ఎంతకీ అది కదలలేదు. అది అలాగే పట్టాలపై ఉండడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో గత్యంతరం లేక ఆ రైలును కొంతమంది రైల్వే సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు కలిసి తోశారు. కొంత దూరం అలా తోసిన తర్వాత అది స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.. ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ ప్రాంతంలో రైలు బ్రేక్ డౌన్ అయింది. ఎంతసేపటికి అది కదలకపోవడంతో రైల్వే కార్మికులు, రైల్వే ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఆ రైలును నెట్టారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ రైలు స్టార్ట్ అయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. ఈ మార్గంలో ఇలా రైళ్లు బ్రేక్ డౌన్ అవ్వడం పరిపాటిగా మారిందని రైల్వే కార్మికులు అంటున్నారు.

    గతంలోనూ ఇలాంటి సంఘటన

    బరేలి ప్రాంతంలో ఇలాంటి ఘటనే గతంలో చోటుచేసుకుంది. పట్టాలపై రైల్వే కోచ్ నిలిచి ఉండగా.. కొందరు ప్రయాణికులు రంగంలోకి దిగారు. రైల్వే సిబ్బందితో కలిసి దానిని ముందుకు తోశారు. అప్పట్లో ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. తాజాగా ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.. రైల్వే సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ అధ్వానంగా ఉందని మండిపడుతున్నారు..” బుల్లెట్ రైళ్ల కోసం వంతెనలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ పేరుతో రైళ్లను నడుపుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే శాఖను పటిష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైలు బ్రేక్ డౌన్ కావడం ఏంటి. అది స్టార్ట్ కాకపోతే ప్రయాణికులు తోయడమేంటి? అదేమన్నా బైకా?, లేక కారా? అంత పెద్ద రైలును ముందుకు తోయాలంటే మాటలా? ఇలాంటి విషయాలపై రైల్వే శాఖ సీరియస్ గా దృష్టి సారించకపోతే ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోతుంది. పొరుగు దేశాలు బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతున్న తరుణంలో.. మనమేమో ఇలా రైళ్లను నెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భారతీయ రైల్వే శాఖపై దుమ్మెత్తి పోస్తున్నారు. రైళ్లు బ్రేక్ డౌన్ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.. ఉన్న రైళ్లను మొత్తం ఆధునీకరించాలని విన్నవిస్తున్నారు..