HomeతెలంగాణRK Big Debate With Revanth: ఆర్కే బిగ్ డిబేట్ పేరుకే.. దాని వెనుక ఎన్నో...

RK Big Debate With Revanth: ఆర్కే బిగ్ డిబేట్ పేరుకే.. దాని వెనుక ఎన్నో కారణాలు

RK Big Debate With Revanth: రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఢిల్లీ పర్యటనలు, మంత్రులతో సమావేశాలు, అధికారులతో సమీక్షలు.. ఒక రకంగా చెప్పాలంటే ఊపిరి సలపనంత బిజీ. పైగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అంతటి విలువైన సమయం ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ కు కేటాయించడం ఒక ముఖ్య మంత్రికి అస్సలు కుదరదు. కానీ రేవంత్ రెడ్డి అలానే చేశారు. శనివారం సాయంత్రం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఇంట్లో నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి గతంలో రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు రాధాకృష్ణకు ఆయన మాటిచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఇస్తానని హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చుకునే క్రమంలో శనివారం సాయంత్రం రాధాకృష్ణ ఇంట్లో నిర్వహించిన ఇంటర్వ్యూ కు హాజరయ్యారు.

సహజంగానే రేవంత్ రెడ్డి అంటే రాధాకృష్ణకు చాలా ఇష్టం. ఆయనకు తన పత్రికలో విశేషమైన ప్రయారిటీ ఇస్తూ ఉంటారు.. గతంలో ఓటుకు నోటు కేసు విషయంలో, ఆ తర్వాత జైలుకు వెళ్లిన క్రమంలో.. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ కు సంబంధించి విధించిన హౌస్ అరెస్టు విషయంలో.. 2018 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు.. ఇలా ప్రతి సంఘటనలోనూ రేవంత్ రెడ్డి కి వేమూరి రాధాకృష్ణ అండగా ఉన్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి సముచితానికి మించి ప్రాధాన్యమిచ్చారు. ఇటీవల ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి సలహాలు, సూచనలు కూడా ఇచ్చారని ఉంది. అయితే అంతర్గత స్వేచ్ఛ అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఎటువంటి అడ్డు ఉండకూడదు? ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు బలంగా చెప్పాలి.. ఆయనకు పోటీగా ఉన్న నాయకులకు కూడా అర్థమయ్యేలా వివరించాలి. ఇదే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. అందుకే వేమూరి రాధాకృష్ణ రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసినట్టు కనిపిస్తోంది. పైగా ఈ నెల రోజులపాటు రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువ ఇంటర్వ్యూ సాగింది. నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఏం చెప్పారు? అమిత్ షా ను ఏం కోరారు? నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు ప్రకటించారు? ఒక కాంగ్రెస్ పార్టీ సీఎం కు బిజెపి నాయకులు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు? అనే కోణంలోనే ఇంటర్వ్యూ సాగింది. అయితే వీటి ఆధారంగా వేమూరి రాధాకృష్ణ సంధించిన ప్రశ్నలకు రేవంత్ అత్యంత పాజిటివ్ గా సమాధానాలు ఇచ్చారు.

వాస్తవానికి వేమూరి రాధాకృష్ణ చాలా టిపికల్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సరదాగా మాట్లాడుకుంటూనే అసలు విషయాలను బయటకు తీస్తారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో తన పాత పద్ధతికి స్వస్తి పలికి.. రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ను మరింత బిల్డప్ చేసే పనిలోనే పడ్డారు. ఇంటర్వ్యూ ప్రారంభం కాగానే ఆయన వ్యక్తిత్వాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో పోల్చారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రాధాకృష్ణ అంతరంగం ఏమిటో. బిజెపి నాయకులకు వ్యతిరేకంగా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ పెద్దల మనసు నొప్పించకుండా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయన అలా మాట్లాడే విధంగానే రాధాకృష్ణ పలు సంధించారు. అంతేకాదు బిఆర్ఎస్ విధానాలను, కెసిఆర్ చేసిన తప్పులను, కేటీఆర్, హరీష్ రావు వ్యవహార శైలిని మరోసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు ఔను అని చెబుతూనే తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జ్యుడీషియల్ ఎంక్వయిరీ, నీటిపారుదల రంగంపై శ్వేత పత్రం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, పార్టీ సీనియర్లకు తాను ఇవ్వబోయే పదవులు, రాహుల్ గాంధీ తనకు ఎంత క్లోజ్.. అనే విషయాలను అత్యంత స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పగలిగారు. స్థూలంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ సారాంశం ఒకే ఒక్కటి.. కాంగ్రెస్ పార్టీలో వచ్చే ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, నాకు అధిష్టానం సపోర్ట్ ఫుల్ గా ఉంది. సో ఎవరు ఎలాంటి కుయుక్తులు పన్నొద్దు.. అనే సంకేతాలు రేవంత్ బలంగా ఇచ్చారు.. రాధాకృష్ణ ఇచ్చేలా చేశారు. ప్రస్తుతానికి అయితే రాధాకృష్ణ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి పాలించుకుంటూ వెళ్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular