CM Revanth Reddy: అధికారంలోకి వచ్చి నెల రోజుల కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అత్యంత వేగంగా పాలనలో అడుగులు వేస్తున్నారు. ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తుల సేకరణ ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 25 లక్షల మంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు.. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాల పట్ల వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేసింది.. త్వరలో నీటిపారుదల రంగానికి సంబంధించి కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన అత్యంత తెలివిగా అడుగులు వేస్తున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
శనివారం రాత్రి ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బిగ్ డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానాల్లో ఇంట్రెస్ట్ గా అనిపించింది, తర్వాత ఆయన తీసుకోబోయే నిర్ణయం ఇదే అనిపించింది ఒకటి ఉంది… అదే కొత్త జిల్లాలకు సంబంధించి జ్యూడిషియల్ కమిటీ. అయితే ఇందులో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు హేతుబద్ధత లేకపోలేదు. ఎందుకంటే 10 జిల్లాల సమూహంగా ఉన్న తెలంగాణ 33 జిల్లాలు అయింది. కొన్ని జిల్లాలు అయితే ఐదారు ముక్కలు అయ్యాయి. కొత్త జిల్లాలలో సమీకృత కలెక్టరేట్లు ఏర్పాటైనప్పటికీ.. మండలాలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరు ముక్కలైంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాలు కూడా ఇలాగే అడ్డగోలుగా విభజనకు గురయ్యాయి. అయితే ప్రభుత్వం వీటిని ఇలా విభజించడం వెనుక కారణం ఉందని.. తమ పార్టీ బలంగా ఉన్నచోట ఒక విధంగా.. ప్రతిపక్షాలు బలంగా ఉన్నచోట మరొక విధంగా జిల్లాలు ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారు. అయితే తాను ఎంపీగా ఉన్నప్పుడు నిర్వహించిన జడ్పీ సమావేశం.. ఇబ్బందిగా అనిపించిందని.. అలా జరగడానికి కారణం అడ్డగోలుగా జిల్లాల ఏర్పాటు అని.. దానిపై జ్యుడీషియల్ విచారణ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఇక సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.. ఇటీవల ఫార్మసిటీ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నామని ప్రకటించడం.. సంచలనంగా మారాయి. తాజాగా జిల్లాలకు సంబంధించి చేసిన కామెంట్స్ కూడా అలానే ఉన్నాయి.
అయితే రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. చాలావరకు కొత్త మండలాలలో కనీస సౌకర్యాలు లేవు. కొన్ని కొన్ని జిల్లా కేంద్రాల్లో నేటికీ సరైన సదుపాయాలు లేవు. అలాంటప్పుడు వాటి వల్ల ప్రజలకు ఉపయోగం ఏముంటుందనేది రేవంత్ ప్రశ్న. అయితే కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని.. జిల్లాల ఏర్పాటు మీద జుడిషియల్ కమిటీ ఎంక్వయిరీ వేస్తే.. అది అధికార పార్టీ నాయకులకే ప్రతి బంధకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జిల్లాల ఏర్పాటు వల్ల పాలన ప్రజల చెంతకు చేరిందని.. అలాంటప్పుడు ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేస్తే ప్రజల్లో ఆగ్రహా వేశాలు చెలరేగే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. ఒకవేళ అంతగా ఇబ్బంది ఉంది అనుకుంటే.. ప్రజాభిప్రాయం తీసుకుని చేయాలని సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నాయకులు రేవంత్ రెడ్డి పై సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఫార్మసిటిపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకున్నారని.. జిల్లాల ఏర్పాటు సంబంధించి కూడా ఇలాగే తీసుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. కెసిఆర్ ముందు చూపుతోనే జిల్లాలు ఏర్పాటు చేశారని.. కానీ ఇదే రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జ్యూడిషల్ కమిటీలో ఎవరిని నియమిస్తారు.. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది.. త్వరలో తేలిపోనుంది.