TANA (8)
TANA: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.
తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడిలు వేమూరి రాధాకృష్ణను శనివారం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికాతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు వివరించారు. 24వ తానా సదస్సు సందర్భంగా నిర్వహించే బిజినెస్ సెమినార్, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథిగా రావాలని తానా ప్రతినిధులు కోరారు.
అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం తానా అమెరికాలో అతిపెద్ద తెలుగు సంస్థగా ఉంటూ అక్కడి తెలుగు సమాజానికి ఎనలేని సేవలందిస్తోంది. ఉత్తర అమెరికాలో తెలుగు సమాజానికి సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో సేవలందించడంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై లక్షల డాలర్లను తానా ఖర్చు చేస్తూ సేవ చేస్తోంది. అమెరికాలో తెలుగు కమ్యూనిటీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సమయలో వారికి తానా అండగా నిలుస్తోంది.
TANA 10వేల మందికి పైగా అమెరికాలో భారతీయ మూలాలున్న సంస్థలు నిర్వహించే సదస్సుల్లో తానా మహాసభలు అతి పెద్దవి. దాదాపు ఈ సదస్సులో 10వేల మందికి పైగా పాల్గొంటారు. వయసుతో సంబంధం లేకుండా సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తానా సదస్సులో పాల్గొనేవారిలో కళాకారులు, చిత్రకారులు, నృత్యకారులు, గాయకులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తానా ప్రతినిధులు ఆహ్వాన పత్రికలో పొందుపర్చారు. ఈ సదస్సులో తప్పకుండా పాల్గొనాలని వేమూరి వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు కోరారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తానా 24వ సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.