KCR Sensational Decision : “కారు”లో నాలుగో వంతు ఖాళీ.. ఎన్నికలకు ముందు కేసీఆర్ సంచలన నిర్ణయం!

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

Written By: Rocky, Updated On : June 4, 2023 5:00 pm

Election Fever In Telangana

Follow us on

KCR Sensational Decision : తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికార భారత రాష్ట్ర సమితి ఆపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. నవాబ్ది వేడుకలకు దశాబ్ది వేడుకలని ట్యాగ్ లైన్ తగిలించి హడావిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఊహించింది ఒకటైతే.. క్షేత్రస్థాయిలో మరొకటి ఎదురవుతోంది. ఈ సందర్భంగా ఎవరైతే ఎక్కువ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో వారికి చెక్ పెట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకరకంగా 21 రోజులపాటు దశాబ్ది వేడుకలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఇదే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కెసిఆర్ వ్యూహం తగ్గట్టుగానే చాలామంది ఎమ్మెల్యేలు దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. శనివారం జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఒక రైతు ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశాడు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పై అక్కడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి జాబితాను తెప్పించుకున్న కేసీఆర్.. వీరికి వచ్చే ఎన్నికల్లో దాదాపుగా టికెట్లు ఇవ్వొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
గత ఎన్నికల్లో ఇలా..
గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 88 సీట్లు గెలుచుకుంది.ఇతర పార్టీల నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుంది. ఫలితంగా బీఆర్‌ఎస్‌ బలం 103కు చేరింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి రాబోయే ఎన్నికల్లో ‘కారు’లో చోటు దక్కకపోవచ్చని సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైన, ప్రత్యేకించి కొందరు ఎమ్మెల్యేలపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, కేసీఆర్‌ సర్కారు నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదులూ ఆరోపిస్తున్నారు. రైతుల రుణమాఫీ లేకపోవడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వకపోవడం, ధరణి సమస్యలు, పెండింగ్‌ బిల్లులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం వంటివీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకూడదని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారని, ఇప్పుడే బయటపెడితే సిటింగుల్లో తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో సరైన సమయం కోసం చూస్తున్నారని అంటున్నారు.
ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నార
పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్న సిటింగ్‌లు, సర్వేల్లో బలహీనంగా ఉన్నవారి జాబితాను కేసీఆర్‌ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. 2018 ఎన్నికల్లో ఏడుగురు సిటింగ్‌లకు మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా భారీ మార్పులు ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి మొన్నటి వరకు సిటింగ్‌లందరికీ టికెట్లు అని కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడా మాట మీద నిలబడడం కష్టమని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. సిటింగ్‌లందరికీ టికెట్లు అంటే ఎన్నికల ముందే చాలా చోట్ల ఓటమిఅంచుల్లోకి వెళ్లడమేనని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఎవరికి చాన్స్‌ ఇస్తారో? ఎవరికి మొండి చేయి చూపుతారో? అని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలను ఇటీవల కాలంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో కేసీఆర్‌ పరోక్షంగా హెచ్చరించారు. తీర్చు మార్చుకోకుంటే కష్టమేనని తేల్చి చెప్పారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లోకి వెళ్లకపోవడం, దళితబంధు లాంటి పథకాల్లో ముడుపులు, ప్రజల్లో ఆదరణ పెంచుకోలేనివారికి కూడా టికెట్లు దక్కవని అంటున్నారు. కొందరికి ఇతర రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతల పేరిట ఇక్కడ టికెట్‌ ఇవ్వకుండా ఉంటారనే ప్రచారం కూడా నడుస్తోంది. నల్లగొండ జిల్లాలో ముగ్గురు సిటింగ్‌లకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది.
ఈ జిల్లాల్లో వీరికి కష్టమే
కరీంనగర్‌ జిల్లాలోనూ ముగ్గురికి టికెట్‌ కష్టమే అని తెలుస్తోంది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే, మెదక్‌లో ఒకరిద్దరిరు, వరంగల్‌ జిల్లాలో ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే టికెట్లు ఇవ్వని జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని, క్రమంగా అందరి పేర్లూ బయటకొస్తాయని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి.” ‘బీఆర్‌ఎస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చాం. ఈ సారి మరో పార్టీకి అవకాశం ఇచ్చి చూద్దాం” అన్న భావన రాష్ట్రంలోని పలు వర్గాల్లో వ్యక్తమవుతోందని అధికార పార్టీ సర్వే నివేదికలు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నిన్నమొన్నటి దాకా ‘మీరు ప్రజల్లో ఉండండి చాలు. అంతా నాదే భారం’ అంటూ భరోసా ఇచ్చిన కేసీఆర్‌.. ఇప్పుడు ‘మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది’ అంటూ  ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మీ ఓటమి మీకే కాదు.. పార్టీకి కూడా నష్టం’ అని ఎమ్మెల్యేలతో అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యతిరేకత ఉందన్న ఒత్తిడితోనే సిటింగ్‌లను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దశాబ్ది ఉత్సవాల పేరిట..
తాజాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట ఎమ్మెల్యేలకు కూడా టార్గెట్లు పెట్టారు. రోజువారీ కార్యక్రమాలను చేపడుతూ గ్రామాలు, పట్టణాల్లో ప్రతి గడపకూ వెళ్లాలని, ఈ 21 రోజులను పూర్తిగా వాడుకొని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయాలని గట్టిగానే చెప్పారు. జనంలోనే ఉండాలంటూ గులాబీ బాస్‌ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉపయోగపడేలా, రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా చూడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినప్పటికీ పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డవారు, ఓడిన వారికి.. సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించడంలో పార్టీ అధిష్ఠానం అలసత్వం వహించింది. అంతర్గత కలహాలపై బయట ఎవరూ మాట్లాడొద్దని హుకుం జారీ చేస్తూ వచ్చింది. సమస్యలు తలెత్తినపుడు పిలిపించి మాట్లాడి పరిష్కారం చూపకుండా.. ‘ఎవరూ మాట్లాడొద్దు. విమర్శలు చేసుకోవద్దు’ అంటూ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలు అప్పటికప్పుడు పనిచేసినా.. ఇప్పుడు అవి పనిచేయని పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతల మధ్య అభిప్రాయభేదాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో బహిర్గతమయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు ముదరడం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
25 మంది ఔట్
ప్రజా వ్యతిరేకత, అంతర్గత కలహాలను దృష్టిలో ఉంచుకొనే.. దాదాపు 25 మంది సిటింగ్‌లకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం.  అయితే వారు కూడా సొంత సర్వేలు చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి టికెట్ ఇవ్వని పక్షంలో, ఇతర పార్టీలోకి వెళ్లేందుకు కూడా వెనుకంజ వేయకూడదని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.