BRS: కడియం కావ్య బాటలోనే మరో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి

వరంగల్ సరిహద్దులో ఉన్న మరో పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీకే ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఆ అభ్యర్థికి ఆ జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 29, 2024 3:35 pm

BRS

Follow us on

BRS: ఐదేళ్లు.. కేవలం ఐదు సంవత్సరాలు.. పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది.. జేజేలు పలికిన వారు దూరం అవుతున్నారు. మాట్లాడితే చప్పట్లు కొట్టిన వారు మాకెందుకులే అనుకుంటూ వెళ్లిపోతున్నారు. తెలంగాణ బాపు అంటూ, కారణజన్ముడంటూ కితాబిచ్చినవారు వేరే పార్టీని చూసుకుంటున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్ ఎంపీ రేవంత్ పంచన చేరారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన కుమార్తె కడియం కావ్య అయితే ఏకంగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. వెళ్తూ వెళ్తూ భారత రాష్ట్ర సమితి అక్రమాలను లేఖ రూపంలో బయటపెట్టి సంచలనం సృష్టించారు. కడియం కావ్య ఇచ్చిన షాక్ తో ఒక్కసారిగా కేసీఆర్ కు ఇబ్బందికర వాతావరణం తలెత్తినట్టు తెలుస్తోంది. వరంగల్ స్థానంలో బాబూ మోహన్ ద్వారా పోటీ చేయిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కడియం కావ్య ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే కేసీఆర్ కు మరో ఎంపీ అభ్యర్థిని ఝలక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

వరంగల్ సరిహద్దులో ఉన్న మరో పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీకే ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ టికెట్ కేటాయించారు. ఆ అభ్యర్థికి ఆ జిల్లాలో రాజకీయ నేపథ్యం ఉంది. అయితే ప్రస్తుతం తను కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. కడియం కావ్య ఎపిసోడ్ తో ఆ అభ్యర్థి అంతర్మథనంలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది.. అభ్యర్థి తన రెండు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో కార్యకర్తల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆ సిట్టింగ్ ఎంపీని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలో పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లేదు. కార్యకర్తలకు కూడా అంతగా అందుబాటులో ఉండడం లేదు. దీంతో అప్పట్లోనే ఆ అభ్యర్థి పోటీ చేస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది. అది అలా ఉండగానే కడియం కావ్య పోటీ చేయడం లేదని లేఖ రాసిన నేపథ్యంలో.. ఈ అభ్యర్థి కూడా అదే బాటలో నడవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. “క్షేత్రస్థాయిలో భారత రాష్ట్ర సమితి పై విపరీతమైన ఆగ్రహం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ తప్పిదాలను బయటపెడుతోంది. ఇలాంటప్పుడు పోటీ చేయడం కంటే నిశ్శబ్దంగా ఊరుకోవడం మేలని నాయకులు అనుకుంటున్నారు. అందులో భాగంగానే కడియం కావ్య తాను పోటీ చేయబోనని ప్రకటించారు. అదే దారిలో ఈ ఎంపీ కూడా నడవ బోతున్నారని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తన పోటీపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ అభ్యర్థి వివరణ ఇచ్చారు..”కేసీఆర్ నాయకత్వంలో నేను పోటీ చేసేందుకు సిద్ధం. ఈ నియోజకవర్గంలో నేను సిట్టింగ్ ఎంపీగా ఉన్నాను. నాకు కేసీఆర్ అనేక అవకాశాలు కల్పించారు. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి గెలిచే పార్లమెంటు నియోజకవర్గాలలో ఈ స్థానం కూడా ఒకటి. ఎవరెవరో ఏదేదో చెబుతుంటారు. వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను పోటీ చేస్తాను. ప్రజల మద్దతుతో రెండవసారి పార్లమెంట్ కు ఎన్నికవుతాను. వదంతులు నమ్మొద్దు. నేను ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటానని” ఆ అభ్యర్థి సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదని, ఇలా వివరణలు ఇచ్చి చాలామంది పార్టీలు మారారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.