Babu Mohan: కడియం కావ్య రాజీనామా.. ఎంపీగా పోటీ నుంచి విరమించుకోవడంతో.. వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారాయి. కావ్య రాజీనామా తర్వాత ఎవర్ని పోటీ చేయిస్తారు? ఎవరికి టికెట్ ఇస్తారు? పైగా ఎస్సీ సామాజిక వర్గంలో అంతటి గట్టి నాయకుడు ఎవరున్నారు? అనే ప్రశ్నలు భారత రాష్ట్ర సమితిలో తలెత్తాయి. కావ్య రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే పై ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పారు. సీనియర్ నటుడు, ప్రస్తుతం ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బాబూ మోహన్ ను వరంగల్ పార్లమెంట్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కడియం కావ్య రాజీనామా, రాసిన లేఖ భారత రాష్ట్ర సమితిలో కలకలం రేపింది. దీంతో వెంటనే కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగారు.
నిన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా సినీ నటుడు బాబూ మోహన్ బరిలో ఉన్నారు. ఈయన ప్రజాశాంతి పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు.. ఇటీవలే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి.. కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో బాబూ మోహన్ చేరారు. ప్రస్తుతం బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి గానూ కొనసాగుతున్నారు. కావ్య రాజీనామా నేపథ్యంలో.. కేసీఆర్ అనూహ్యంగా బాబూ మోహన్ ను తెరపైకి తీసుకొచ్చారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని, ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని చెప్పడంతో బాబూ మోహన్ పోటీకి ఓకే అన్నట్టు తెలిసింది. గతంలో 2014 ఎన్నికల్లో ఆందోల్ అసెంబ్లీ నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున బాబూ మోహన్ ఎమ్మెల్యే గా గెలిచారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ బాబూ మోహన్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున చంటి క్రాంతి కిరణ్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బాబూ మోహన్ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
ఒక్కసారిగా మారిపోయింది
పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒకసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కూడా కావ్య పోటీ చేస్తారని ప్రకటించారు. కావ్య పేరు ప్రకటించడంతో వరంగల్ భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే క్రమంలో వరంగల్ టికెట్ ఆశించి.. ఇక్కడ నేతలతో పొసగక వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నిన్నటి వరకు ఇక్కడ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలో ఉన్న కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
కడియం కావ్య రాజీనామాతో ఒకసారిగా వరంగల్ రాజకీయాలలో కలకలం నెలకొంది. కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. త్వరలో కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కడియం కావ్య కాకుండా కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కడియం శ్రీహరితో మాట్లాడిందని.. ఆయన కూడా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా ఇంతవరకు ఎవరినీ ప్రకటించకపోవడం వెనుక అసలు కారణం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేపో, మాపో కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్య తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసే క్రమంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.