Kaushik Reddy Vs Arikepudi Gandhi: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘ఆంధ్రా’వాదం.. కేసీఆర్ మద్దతిస్తారా? ఆ పార్టీకి ప్లస్సా.. మైనస్సా?

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య ఏడాదికాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు పార్టీల నాయకులు నువ్వా నేనా అన్నట్లు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అయితే మాటల యుద్ధం.. ఇప్పుడు చేతల వరకు వెళ్లింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, అదే పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదం దాడుల వరకు వెళ్లింది.

Written By: Raj Shekar, Updated On : September 12, 2024 5:45 pm

Kaushik Redd Vs Arikpudi Gandhi

Follow us on

Kaushik Reddy Vs Arikepudi Gandhi: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య ఏడాదిగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు చేతల వరకు వెళ్లింది. ఇన్నాళ్లూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న నేతలు.. ఇప్పుడు దాడులకు రెడీ అని కాలుదువ్వుతున్నారు. నాయకుల దూకుడుతో వారి అనుచరులు రెచ్చిపోయారు. బీఆర్‌ఎస్‌లో గెలిచి..కాంగ్రెస్‌లో చేరిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చినికి చినికి తుపానులా మారాయి. చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లాయి. పీఏసీ చైర్మన్‌గా నియమితులైన గాంధీ.. తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే అని ప్రకటించారు. అయితే.. తాను గాంధీ ఇంటికి వెళ్లి.. ఆయన ఇంటిపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తానని పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. ఇదే వివాదానికి దారితీసింది.

కౌశిక్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..
కౌశిక్‌రెడ్డిని పీఏసీ చైర్మన్‌ గాంధీ ఇంటికి వెళ్లకుండా పోలీసులు గురువారం(సెప్టెబర్‌ 12న) హౌస్‌ అరెస్టు చేశారు. అయితే కౌశిక్‌ సవాల్‌ను స్వీకరించిన గాంధీ 11 గంటల వరకు తన ఇంటికి రాకుంటే.. తానే వస్తానని ప్రకటించారు. కౌశిక్‌ రాకపోవడంతో గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గాంధీని కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గాంధీ అనుచరులు వెంట తెచ్చుకున్న టమాటాలు, కోడిగుడ్లను కౌశిక్‌రెడ్డి ఇంటిపై విసిరారు. రాళ్లు రువ్వారు. దీంతో కౌశిక్‌ ఇల్లు స్వల్పంగాదెబ్బతిన్నది.

నాన్‌లోకల్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..
దాడి తర్వాత మీడియాతో మాట్లాడిన పాడి కౌశిక్‌రెడ్డి పోలీసుల తీరును తప్పు పట్టారు. తాను నిఖార్సైన తెలంగాణ వాదినని.. గాంధీ తెలంగాణకు బతకడానికి వచ్చాడని ఆరోపించారు. తెలంగాణ వాడిపై దాడిచేస్తే తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో రేపు చూపిస్తా అని హెచ్చరించారు. నాన్‌లోకల్‌ వ్యాఖ్యలపై గాంధీ కూడా దీటుగా స్పందించారు. తెలంగాణ ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. కరీంనగర్ నుంచి కౌశిక్‌ హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాడని ప్రశ్నించాడు. కఠిన పదాలను ఉపయోగించాడు.

మళ్లీ ప్రాంతీయ వాదం…
తాజాగా పాడి కౌశిక్‌రెడ్డి మాటలు ఇప్పుడు మళ్లీ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తెచ్చాయి. అసలైన తెలంగాణవాదులం అని మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేపు తెలంగాణ సత్తా చూపుతామనడంతో ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో ఉన్నవారంతా తెలంగాణ వాదులే అని గతంలోనే కేసీఆర్‌ ప్రకటించారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్‌రెడ్డి.. ఇప్పుడు వివాదాస్పద నాన్‌ లోకల్‌ అంటూ మాట్లాడడం ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశవైంది. దీనిపై గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.