Sitaram Yechury : విద్యార్థినేతగా రాజకీయాల్లోకి.. వామపక్ష యోధుడిగా కాలగర్భంలోకి.. ఇదీ సీతారాం ఏచూరి ప్రస్థానం

రాజకీయ నాయకుడు, ఉన్నత విద్యావంతుడు, వామపక్ష యోధుడు, కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఇకలేరు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 5:48 pm

Sitaram Yechury

Follow us on

Sitaram Yechury : ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ పెరిగిపోవడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆర్థికవేత్తగా ఆయనకు పేరుంది. సామాజిక కార్యకర్తగా ఆయన పని చేశారు. పలు పత్రికలలో వ్యాసాలు రాసి, కాలమిస్ట్ గా గుర్తింపు పొందారు. 1992లో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. సీతారాం ఏచూరి మద్రాసులోని ఓ తెలుగు కుటుంబంలో ఆగస్టు 12 ,1952న జన్మించారు. తండ్రి పేరు సర్వేశ్వర సోమయాజుల ఏచూరి. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్ లో ఇంజనీర్ గా పని చేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా సీతారాం ఏచూరి కి మేనమామ అవుతారు. ఏచూరి హైదరాబాదులో తన బాల్యాన్ని గడిపారు. ఆల్ సెన్స్ స్కూల్లో మెట్రిక్యులేషన్ చదివారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ స్కూల్ లో తదుపరి చదువులు చదివారు. సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బిఏ లో ఆర్థిక శాస్త్రాన్ని చదివారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. వాస్తవానికి అదే యూనివర్సిటీలో పిహెచ్డీ లో ఆయన చేరినప్పటికీ.. ఎమర్జెన్సీ కాలంలో దానిని ఆయన పూర్తి చేయలేకపోయారు. సీతారాం ఏచూరి ఇంద్రాణి మజుందార్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరు విడిపోయారు. ఈ క్రమంలో జర్నలిస్టు సీమా చిశ్తి తో ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు..సీమా, సీతారాం ఏచూరి దంపతులకు ముగ్గురు సంతానం.

రాజకీయ ప్రస్థానం అలా మొదలైంది

సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం 1974 నుంచి మొదలైంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతగా ఆయన తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1975లో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ చదువుతున్నప్పుడు సిపిఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకొని.. అందులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ కారత్ సహకరించడంతో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీని వామపక్ష విద్యార్థి సంఘానికి అనువైన ప్రాంతంగా మార్చారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సేవలు గుర్తించి 1984లో సిపిఎం కేంద్ర కమిటీ అవకాశం ఇచ్చింది. 1992లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నిక చేసింది. 2005లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో 2015లో జరిగిన పార్టీ 21వ జాతీయ మహాసభల్లో ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఆయన ఇదే పదవిలో కొనసాగుతున్నారు.

ఉద్యమ నేతగా గుర్తింపు

సీతారాం ఏచూరి కి ఉద్యమ నేతగా గుర్తింపు ఉంది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం అప్పటి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తో కలిసి 1996లో కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదా రూపొందించారు. యూపీఏ 2004లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కీలకపాత్ర పోషించారు. రచయితగా సీతారాం ఏచూరి కి మంచి పేరు ఉంది. “లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్” పేరుతో ఒక ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాసేవారు. “క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే”, “సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్,” “మోదీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం”, “కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం” అనే పుస్తకాలను రాశారు.