TS Vote On Account Budget: ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల పథకాల అమలుకు 53,196 కోట్లు కేటాయించి సంక్షేమం, ప్రధాన ధ్యేయంగా తమ సర్కారు పరిపాలన కొనసాగిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆరు గ్యారెంటీ పథకాలే తమ లక్ష్యమని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. బడ్జెట్లో అందుకు తగ్గట్టుగానే కేటాయింపులు జరిపి ప్రతిపక్షాల నోర్లు మూయించారు. విద్య, వైద్యం, వ్యవసాయ శాఖలకు రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తో రెండు లక్షల 90 కోట్లతో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకటింపజేశారు. బడ్జెట్ అనంతరం ఇరుసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రసంగం ఇలా
కాలేశ్వరం, మేడిగడ్డలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని భట్టి ప్రకటించారు. కృష్ణా జలాలపై రాజీలేని పోరాటం చేస్తామని వివరించారు. భారత రాష్ట్ర సమితి 10 సంవత్సరాలు చేసిన తప్పిదాలే నీటిపారుదల శాఖకు ఇబ్బందిగా మారాయని భట్టి ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ప్రణాళిక, హేతుబద్ధత లేని కారణంగా అప్పులు సవాలుగా మారాయని అన్నారు. నంది పురస్కారాల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. డ్రగ్స్ వాడకంపై ఉక్కు పాదం మోపుతున్నామని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వం వాస్తవ లెక్కలు దాచి బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. తాము మాత్రం దూద్ కా దూద్ పానీ కా పానీ అనే తీరుగా బడ్జెట్ ప్రవేశపెట్టామని భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు.
కేటాయింపులు ఇలా
గత ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్ల పథకంతో ప్రజలను మోసం చేసిందని.. తమ ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని భట్టి ప్రకటించారు. ఈ బడ్జెట్ లో గృహ నిర్మాణ శాఖకు 7,740 కోట్లు కేటాయిస్తున్నట్టు భట్టి వివరించారు. ఇల్లు లేని వారికి ఇల్లు, ఇళ్ల స్థలం ఉంటే నిర్మాణానికి 5 లక్షల సహాయం ఇస్తామని ప్రకటించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ పథకాన్ని అమలు చేస్తామని భట్టి ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ఇస్తామని భట్టి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు ఉపకార వేతనాలు కూడా సకాలంలో అందజేస్తామని భట్టి ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, దీనికోసం 500 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నామని భట్టి ప్రకటించారు. ఐటిఐ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకొస్తామని, 100% ఉద్యోగాలు వచ్చేలాగా యువతకు శిక్షణ ఇస్తామని.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని భట్టి ప్రకటించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు గుజరాత్, ఢిల్లీ, ఒడిషా రాష్ట్రాలకు బృందాన్ని పంపుతామని భట్టి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు భట్టి ప్రకటించారు. విద్యా రంగానికి 21,389 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమం కోసం ఎనిమిది వేల కోట్లు, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసం 500 కోట్లు కేటాయిస్తున్నట్టు భట్టి ప్రకటించారు.
వైద్య రంగానికి ఇలా..
ఇక కీలకమైన వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యుత్_ గృహ జ్యోతి అమలుకు 2,418 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16, 825 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు, గృహనిర్మాణానికి 7740 కోట్లు, మూసీ సుందరీకరణకు 1000 కోట్లు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 40 కోట్లు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ పై కార్యాచరణ, ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చేలాగా విధానాలు భట్టి రూపొందిస్తున్నామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలోనే 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, గ్రూప్_1లో 64 ఉద్యోగాలు చేర్చి భర్తీ చేస్తామని శాసనసభ వేదికగా భట్టి ప్రకటించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని.. దానిని మననం లో పెట్టుకునే రుణ మాఫీ అమలు చేస్తున్నామని భట్టి అన్నారు.