
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లుగా టెట్ నిర్వహించడం లేదు, దీంతో టీచర్ల పోస్టులు ఎలా భర్తీ చేస్తారని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఎన్నికల హడావుడి కోసమే కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు ప్రస్తుతం 8 శాతం ఉందన్నారు. ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలున్నాయో లెక్కలుంటాయి గానీ, దానికి కమిటీలు నియమించాల్సిన అవసరం లేదన్నారు. పాత జోన్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు ఉంటాయన్నారు. ఇప్పడున్న జోన్ల ప్రకారం ఉద్యోగాలు భర్తీ కాలేదన్నారు. టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని, ఆ ప్రక్రియను మూడేళ్లుగా పెండింగులో పెడుతున్నారన్నారు. 50 మందికి పైగా ఉద్యోగాలు లేక ఆత్మహత్యకు పాల్పడ్డారని కోదండరాం విమర్శించారు.