YouTube: ఇలాంటి క్రమంలో మీడియాకు కాస్తో కూస్తో ఆదాయాన్ని యూ ట్యూబ్ ఆర్జించి పెడుతోంది.. టీవీ చానల్స్ కు ఆదాయాన్ని వివిధ రూపాలలో అందిస్తోంది. టీవీ చానల్స్ కూడా పోటాపోటీగా యూ ట్యూబ్ లో చానల్స్ ను ఏర్పాటు చేశాయి. కుకింగ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, లైఫ్ స్టైల్ విభాగాలలో చానల్స్ ఏర్పాటు చేసి..ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాయి. అయితే తెలుగు చానల్స్ ఇటీవల కాలంలో తిక్క తిక్క థంబ్ నైల్స్ పెట్టి చూసే వాళ్లకు సరైన సమాచారం అందించడం లేదని.. వీక్షకుల విలువైన సమయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయని యూట్యూబ్ ఎప్పటినుంచో గమనిస్తోంది. అందువల్లే ఇటీవల కాలంలో తెలుగు న్యూస్ చానల్స్ రీచ్ ను యూ ట్యూబ్ చాలా వరకు తగ్గించింది. షాకింగ్, సంచలనం, ఉత్కంఠ, బ్రేకింగ్.. వంటి పేర్లతో థంబ్ నైల్స్ పెట్టడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇది తప్పుడు సమాచార వ్యాప్తిని కలగజేస్తోందని.. తద్వారా వీక్షకుల నుంచి తమకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయని యూట్యూబ్ చెబుతోంది.. అడ్డగోలు సమాచారం.. తప్పుడు సందేశాల వ్యాప్తి వంటివి పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి నిబంధనలను యూట్యూబ్ కఠినతరం చేస్తోందని తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో నాణ్యమైన కంటెంట్ అందించే ఇండివిజువల్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రాముఖ్యత ఇస్తుందని సమాచారం.
క్లిక్ బైట్ లు తొలగించాల్సిందే
తెలుగులో వేలాదిగా ఉన్న న్యూస్ చానల్స్ అడ్డగోలు థంబ్ నైల్స్ పెట్టి.. లక్షలాదిగా ఈ వీడియోలను యూట్యూబ్లో ఉంచాయి. ఇందులో థంబ్ నైల్స్ కు.. లోపల ఉన్న కంటెంట్ కు ఏమాత్రం సంబంధం లేదు. పైగా అందులో అత్యంత దారుణమైన సంభాషణలు.. ఇతరత్రా ఉన్నాయి. అందువల్లే వాటిని క్లిక్ బైట్ లు గా ఉన్నాయని యూ ట్యూబ్ చెబుతోంది.. అలాంటి వీడియోలను తొలగించాలని తెలుగు న్యూస్ చానల్స్ ను యూట్యూబ్ కోరింది. అంతేకాదు ఆ తర్వాతే రీచ్ ఇస్తామని తెలుగు యూ ట్యూబ్ చానల్స్ కు సూచించింది. ఇందులో భాగంగా ఈనెల 28న తెలుగు న్యూస్ చానల్స్ కు వర్చువల్ సెషన్ నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని న్యూస్ యూ ట్యూబ్ చానల్స్ కు సమాచారం పంపించింది. “గత కొంతకాలంగా తప్పుడు సమాచార వ్యాప్తి దర్జాగా సాగుతోంది. ఇది వీక్షకుల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తోంది.. సమాచార వ్యాప్తిలో.. సమాచార విప్లవంలో వీక్షకులకు అన్ని సరైనవే తెలియాల్సి ఉంది. ఈ సాంకేతిక కాలంలోనూ తప్పుడు సమాచారానికి తావులేదు. ఇష్టానుసారమైన వ్యాఖ్యలకు అవకాశం లేదు. లక్ష్యంతో చేసుకునేవారికి ఒక వేదికలాగా ఉంటుంది. వారి వారి సొంత ఏజెండాలకు ఇది ఏమాత్రం ఎర్ర తివాచీ పరచదని” యూ ట్యూబ్ తను తెలుగు న్యూస్ చానల్స్ కు పంపిన హెచ్చరికలో పేర్కొందని టెక్ నిపుణులు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ఇకపై అడ్డగోలుగా థంబ్ నైల్స్ పెడితే.. ఇష్టానుసారంగా చేస్తే.. యూ ట్యూబ్ ఏమాత్రం ఊరుకోబోదన్నమాట!