Rameswaram Cafe Blast: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇట్టే తెలుస్తోంది. అలాంటిది పెరిగిపోయిన టెక్నాలజీతో సంఘవిద్రోహ శక్తుల ఆచూకీ పోలీసులు కనుక్కోలేరా.. వారు ఎక్కడ దాక్కున్నారో? ఎలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారో తెలుసుకోలేరా? కచ్చితంగా తెలుసుకుంటారు. అంతరిక్షం మినహా ఈ భూమ్మీద ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారు. గల్లా గుంజి జైల్లో వేస్తారు.. గత నెలలో దేశ ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపిన రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనలో నిందితులను పోలీసులు అలాగే పట్టుకున్నారు. ఇంతకీ ఈ ఆపరేషన్ ఎలా జరిగిందంటే..
రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగిన నాటి నుంచి కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారు అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తలదాచుకున్నారు. ఈ బాంబు పేలుడు ప్రధాన సూత్రధారి ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్ తో పాటు మరో నిందితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. పేలుడు సూత్రధారి ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతిన్ తాహా రామేశ్వరం కేఫ్ లో ఘటన జరిగిన నాటి నుంచి అస్సాం, బెంగాల్ రాష్ట్రంలో తలదాచుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి చిత్రాలను గత నెలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల పోలీసులు విడుదల చేశారు. వీరు పరస్పర సమన్వయం, సహకారం అందిపుచ్చుకోవడంతో నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. అంతకుముందు వీరి ఆచూకీ చెబితే పది లక్షల రివార్డు ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది.
అయితే ఈ నిందితులను ఒక క్యాప్ పట్టించింది. దానిని కొనుగోలు చేసేందుకు వెళ్ళినప్పుడు సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా వారిని అధికారులు గుర్తించారు. నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చుతూ అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాడార్ నుంచి వారు తప్పించుకోలేకపోయారు. ఇక ఈ పేలుడు వెనుక కీలక పాత్రధారి మల్నాడు ప్రాంతవాసి అని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. అతడు గతంలో తమిళనాడు రాష్ట్రంలోని శివనసముద్రం, గుండ్లు పేట, క్రిష్ణగిరి అటవీ ప్రాంతంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చాడు..
దర్యాప్తు ఎలా సాగిందంటే..
రామేశ్వరం కేఫ్ లో గత నెల 1న మధ్యాహ్నం ఈ ఐడి బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో పదిమంది గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఆ ప్రమాదం జరిగిందని ముందుగా పోలీసులు భావించారు. అయితే ఆ సంఘటన స్థలంలో హ్యాండ్ బ్యాగ్ పేలినట్టు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై ఐపిసి సెక్షన్ 307, 471, UAPA చట్టంలోని 16, 18, 38 పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 3, 4 కింద కేసు నమోదు చేశారు. మార్చి మూడున ఈ కేసును కర్ణాటక హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. కేసు దర్యాప్తులో భాగంగా.. పేలుడులో నిందితుడు ఆర్డిఎక్స్ ఉపయోగించాడని తేలింది. నిందితుడు రామేశ్వరం కేఫ్ లోకి ప్రవేశించాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లిపోయాడు? అనే అంశాల ఆధారంగా పోలీసులు కీలకంగా దర్యాప్తు చేపట్టారు. పలువురు అనుమానితులను విచారించారు.
అదే పట్టించింది
బాంబు పెట్టిన వ్యక్తి రామేశ్వరం కేఫ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిన్నాడు. అనంతరం తన చేతిలోని పేలుడు పదార్థాలు ఉన్న సంచిని అక్కడ పెట్టి హడావిడిగా వెళ్లిపోయాడు. ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దాంతోపాటు ఐదు కిలోమీటర్ల పరిధిలో వందల కొద్ది సీసీ కెమెరాలు దృశ్యాలను దర్యాప్తు అధికారులు విశ్లేషించారు. అయితే ఈ పేలుడుకు కీలక సూత్రధారి టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకొని, నల్ల బూట్లు వేసుకొని, అలాంటి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని ఒక అంచనాకొచ్చారు. అ టోపీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి వచ్చాయి. వాటి ఆధారంగా మరింత లోతుగా వేట మొదలుపెట్టారు. చివరికి నిందితులు ఆ టోపీ ద్వారానే దర్యాప్తు సంస్థల అధికారులకు చిక్కారు. అందుకే ఈ టెక్నాలజీ కాలంలో నేరస్తులు ఎంతటి తోపులైనా సరే తప్పించుకోలేరు.. ఈ పేలుడు ఘటనలో నిందితులు తమ ముఖం తెలియకుండా.. తమ ఆనవాళ్లు గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ చివరికి వారు ధరించిన టోపీ పట్టించింది.