Sunitha Williams : అంతరిక్షంలో ఎక్కువ సమయం గడినిప మహిళా వ్యోమగామిగా రికార్డు సృషించిన భారత, అమెరికన్ అస్ట్రోనాట్ సునీతవిలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మే 7వ తేదీన ప్రైవేటు స్పేస్ జెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
ఇప్పటికే రెండుసార్లు వెళ్లొచ్చిన అస్ట్రోనాట్..
సునీతా విలియమ్స్ ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 2006లో మొదటిసారి స్పేస్‌లోకి వెళ్లారు. అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి రెండుసార్లు బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు. తర్వాత 2012 జూలై 14న మరోమారు అంతరిక్షంలోకి వెళ్లారు. సుమారు నాలుగు నెలలు అక్కడే గడిపారు. రెండోసారి వెళ్లినప్పుడు కూడా ఆమె స్పేస్‌వాక్ చేశారు. రెండుసార్లు వెళ్లిన సునీత 50 గంటల 40 నిమిషాలపాటు సే‍్పస్‌వాక్ చేసి చరిత్ర సృష్టించారు.
మూడో విడత యాత్ర..
తాజాగా ఈనెల 7న మూడోసారి అంతరిక్షయాత్ర చేయనున్నారు. బుచ్ విల్మోర్‌తో కలిసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అమెరికాకు చెందిన ప్రైవేటు స్పేస్‌షిప్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్‌షిప్‌లో స్పేస్‌లోకి వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం(మే 7న) ఉదయం 8 గంటలకు కెన్నడీ స్పేస్ సెంటర్ స్పేస్‌షిప్ అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది.
ఆసక్తికర విషయాలు వెల్లడి..
కొన్ని గంటల్లో అంతరిక్షంలోకి వెళ్లనున్న సునీతవిలియమ్స్ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించబోతున్నందున కొంచెం ఉద్విగ్నంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో ఉత్సాహంగానూ ఉన్నట్లు చెప్పారు. అంతరిక్ష ప్రయాణంలో తనతోపాటు గణపతి ప్రతిమను వెంట తీసుకెళ్తానని వెల్లడించారు. దీంతో అదృష్టం కలిసివస్తుందని తాను భావిస్తున్నానని తెలిపారు. గతంలో రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లిన ఆమె ఆ సమయంలో భగవద్గీత తీసుకెళ్లారు.