Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. సాంకేతిక రంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. కొత్త కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. మంచి వెనకే చెడు ఉన్నట్టు.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాగానే లక్షలాదిమంది ఐటీ ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు. భవిష్యత్తులో ఈ కొలువుల కోత మరింత తీవ్రంగా ఉంటుందట.. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాట్ జిపిటి, చాట్ జెమిని వంటివి పనిచేస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్న సరికొత్త అనుభూతిని ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. వంద వస్తువులు ఇస్తే ఒక కొత్త వస్తువు తయారు చేయడం, కొన్ని గేయాల సమాహారాన్ని అందిస్తే, కొత్త గేయాన్ని రూపొందించడం.. వంటి వాటిని ఐటి నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేస్తున్నారు. అయితే నార్వే దేశానికి చెందిన ఐటీ నిపుణులకు ఏఐ ద్వారా పెర్ఫ్యూమ్ తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.
వాస్తవానికి సుగంధ పరిమళాల తయారీలో సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కొత్త కొత్త పెర్ఫ్యుములు తయారు చేస్తే.. మార్కెట్లో పెద్ద లీడర్ గా ఎదగొచ్చు. ప్రస్తుతం ఉన్న విధానాల ప్రకారం కొత్త సెంట్ సృష్టించాలంటే తక్కువలో తక్కువ నాలుగు సంవత్సరాల దాకా పడుతుంది. అంతేకాదు రెండు కిలోల సుగంధ పరిమళాలను తయారు చేయాలంటే కోటి రూపాయల దాకా ఖర్చవుతుంది. ఇంతటి వ్యయం అవుతుంది కాబట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా కొత్త సుగంధ పరిమళాలను తయారు చేసేందుకు నార్వే దేశానికి చెందిన నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా న్యూరల్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించి, శిక్షణ ఇచ్చారు. అంతేకాదు అందులో రకరకాల సువాసనలు, వాటికి సంబంధించిన రసాయనాల అణువుల సమాచారాన్ని జత చేశారు. దానికంటే ముందే ఒక కొత్త సుగంధ పరిమళాన్ని ఎలా తయారు చేయాలో కూడా చెప్పారు..
శాస్త్రవేత్తలు చెప్పిన సలహాలు ప్రకారం న్యూరల్ నెట్వర్క్ ఇప్పటికే పలు రకాల సుగంధ పరిమళాలను తయారు చేసిందట. అయితే ఈ వాసనలు తయారు చేసేందుకు శాస్త్రవేత్తల కైతే తక్కువలు తక్కువ నాలుగు నుంచి ఆరు సంవత్సరాల దాకా పట్టేదట. కానీ, న్యూరల్ నెట్వర్క్ కు కొద్దిరోజుల సమయం మాత్రమే అవసరమైందట. పలు రకాల సుగంధ పరిమళాలలో తయారుచేసిన న్యూరల్ నెట్వర్క్.. భవిష్యత్తులోనూ మరిన్ని అత్తర్లు రూపొందించేందుకు కృషి చేస్తోందట. ఈ ప్రయోగం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధారపడితే.. భవిష్యత్తులో మనుషుల అవసరం లేకుండా పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారట. న్యూరల్ నెట్వర్క్ ద్వారా తయారు చేస్తున్న అత్తర్లు సువాసనపరంగా బాగానే ఉన్నప్పటికీ.. నాణ్యత విషయంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటిదాకా చాట్ జిపిటి, చాట్ జెమిని వంటి వాటిని మాత్రమే చూసిన మనం.. భవిష్యత్తు కాలంలో ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిందే వాడాల్సి ఉంటుందేమో.