Viral News : ఆధార్.. ఇండియాలో గుర్తింపు కార్డు. ఈ దేశ పౌరుడిగా ఆధార్ కార్డు పొందడం ప్రధమ విధి. పుట్టిన పిల్లాడి నుంచి ఇప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఇప్పుడు జంతువులకు కూడా ఆధార్ కార్డు మంజూరు చేస్తుండడం విశేషం. కుక్కలకు సైతం ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో 100 కుక్కలకు ఈ కార్డులను జారీ చేశారు. అయితే కుక్కలకు ఎలా ఆధార్ కార్డు జారీ చేస్తారు? ఎవరు జారీచేస్తారు అన్నదే కదా మీ అనుమానం. ఒక బలమైన కారణం ఉంది. ఇటీవల కొందరు దుండగులు వీధి కుక్కలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ సరదా కోసం కొట్టడమో.. చంపడమో చేస్తున్నారు. ఈ ముక్కు నుంచి వీధి కుక్కలను తప్పించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆధార్ కార్డు ఆలోచన చేసింది.
ఢిల్లీ టెర్మినల్ ఎయిర్పోర్ట్,ఇండియా గేట్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో 100 కుక్కలకు క్యూఆర్ కోడ్స్ తో కూడిన కార్డ్స్ ని ఆ స్వచ్ఛంద సంస్థ జారీచేసింది. వాటి మెడలో ఈ కార్డులను వేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ కుక్క ఏ వీధికి చెందిందో తెలుస్తుంది.కుక్కలకు గాయమైనప్పుడు, లేకుంటే తప్పిపోయినప్పుడు ఈ కోడ్ ను స్కాన్ చేసి ఆ ఏరియా అధికారులకు సమాచారం అందించొచ్చు.ఒక్కోసారి కుక్కలు అదృశ్యం అవుతాయి. అటువంటి సమయంలో ట్రాక్ చేసేందుకు ఈ ఆధార్ కార్డ్స్ పనికి వస్తాయని అధికారులు చెబుతున్నారు.వీధి కుక్కలకు రక్షణ వలయంగా పనిచేస్తాయని జంతు ప్రేమికులు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే బొంబాయిలో సైతం ఓ స్వచ్ఛంద సంస్థ వీధి కుక్కల వివరాలతో కూడిన డిజిటల్ క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ముంబై పరిసర ప్రాంతాల్లో సంచరించే 20 వీధి కుక్కల మెడలో క్యూఆర్ కోడ్ టాగులను తగిలించారు.ఆ కోడ్ ను స్కాన్ చేయగానే సదరు కుక్క పేరుతో పాటు అది ఉండే ప్రదేశం,దాని యజమాని, వాక్సినేషన్ రికార్డ్స్, దాని ఆరోగ్య వివరాలు ఇట్టే వచ్చేస్తాయి. వీధి కుక్కలు తప్పిపోతే.. తిరిగి సొంతగూటికి చేర్చేందుకే ఈ వినూత్న ప్రయోగమని సదరు సంస్థ చెబుతోంది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రయోగాత్మకంగా ఆధార్ కార్డు ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది.