Ola Maps : ఓలా వచ్చేసింది.. ఇక గూగుల్ కు దబిడి దిబిడే..

Ola Maps : మెరుగైన అనుభూతితోపాటు.. స్పష్టమైన లొకేషన్ చూపించడం తమ యాప్ ప్రత్యేకత అని ఓలా చెబుతోంది.. ఈ మ్యాప్స్ వల్ల యూజర్లకు ఎటువంటి తికమక ఉండదని... నేరుగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని వివరిస్తోంది.

Written By: NARESH, Updated On : July 7, 2024 4:16 pm

Ola Maps is an alternative to Google Maps

Follow us on

Ola Maps : టెక్నాలజీలో గూగుల్ పెద్దన్న. క్రోమ్ మంచి మొదలు పెడితే మ్యాప్స్ వరకు గూగుల్ అడుగుపెట్టని రంగం అంటూ లేదు. అందుకే గూగుల్ కంటే ముందు ఉన్న సంస్థలు.. దానితో పోటీ తట్టుకోలేక పెట్టే బేడా సర్దేసుకున్నాయి..యాహూ ఇలాంటి సంస్థ తన ద్వారాలను మూసేసే పనిలో ఉంది. అయితే తొలిసారిగా గూగుల్ కు ఓ కంపెనీ ఛాలెంజ్ విసురుతోంది… మేము వచ్చేస్తున్నాం.. దమ్ముంటే కాస్కో అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి? గూగుల్ కు ఎందుకు సవాళ్లు విసురుతోందంటే..

మిగతా అన్ని విషయాల్లో కంటే మ్యాప్స్ విభాగంలో గూగుల్ చాలా బాగా క్లిక్ అయింది. కొన్ని కొన్ని సార్లు ఇది విఫలమైంది. అయినప్పటికీ మ్యాప్స్ విభాగం గూగుల్ కు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అయితే ఈ విభాగంలో పోటీ సంస్థలు లేకపోవడంతో గూగుల్ కు కలసి వస్తోంది. పైగా ఇందులో రకరకాల ఫీచర్లు యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అందువల్లే గూగుల్ మ్యాప్స్ తిరుగులేని స్థాయిలో ఆదరణ పొందుతున్నది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు గూగుల్ మ్యాప్స్ తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాక మానదు. అయితే తొలిసారిగా గూగుల్ మ్యాప్స్ కు ప్రముఖ ఆన్ లైన్ ట్రాన్స్ పోర్ట్ సంస్థ ఓలా ఛాలెంజ్ విసురుతోంది. గూగుల్ మ్యాప్స్ కు ప్రత్యామ్నాయంగా ఓలా మ్యాప్స్ తీసుకొస్తోంది. దీనిని ఆ సంస్థ సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు..”గతంలో మ్యాప్స్ కోసం ప్రతి ఏడాది 100 కోట్ల వరకు చెల్లించేవాళ్లం. ఇకనుంచి ఆ ఖర్చు ఉండదు. ఓలా యాప్ యూజర్లు వెంటనే దానిని అప్డేట్ చేసుకోవాలి. ఈ మ్యాప్స్ లో స్ట్రీట్ వ్యూ కనిపిస్తుంది. ఇండోర్ ఇమేజ్ దర్శనమిస్తుంది. త్రీడీ మ్యాప్ సౌలభ్యం లభిస్తుంది. డ్రోన్ మ్యాప్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఇవన్నీ సాధ్యమైనంత త్వరలో యూజర్లకు అందిస్తామని” భావిశ్ అగర్వాల్ చెబుతున్నారు. ఓలా గేమ్ చేంజర్ లాగా దీన్ని తీసుకురావడంతో.. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓలా ఆన్ లైన్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో మనదేశంలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతోంది. కాస్మో పాలిటన్, మెట్రో, టైర్ -1, టైర్ -2 వంటి పట్టణాలలో కూడా సేవలు అందిస్తోంది.. వేలాది వాహనాలతో ఎంతమంది కార్మికులకు ఉపాధి అందిస్తోంది. అయితే మ్యాప్స్ కోసం ఏటా ఈ సంస్థ 100 కోట్ల దాకా ఖర్చు చేసేది. అయితే ఇకపై ఆ అవసరం లేకుండా తానే మ్యాప్స్ రూపొందించింది.. ఉపగ్రహం సహాయంతో ఈ సౌలభ్యాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మెరుగైన అనుభూతితోపాటు.. స్పష్టమైన లొకేషన్ చూపించడం తమ యాప్ ప్రత్యేకత అని ఓలా చెబుతోంది.. ఈ మ్యాప్స్ వల్ల యూజర్లకు ఎటువంటి తికమక ఉండదని… నేరుగా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని వివరిస్తోంది.