International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్).. గంటకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఈ కేంద్రం ఫుట్‌బాట్ స్టేడియం సైజులో ఉన్న ఒక ప్రయోగశాల. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ కేంద్రంగానే పరిశోధనలు సాగిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఈ కేంద్రానికి వెళ్లారు. ఈ ప్రయోగశాల అతి త్వరలో సముద్రంలో కూలిపోనుంది. 2030 నాటికి పాతబడిపోతున్న ఐఎస్‌ఎస్‌ను అంతరిక్షంలో చెత్తగా మిగిలిపోకుండా, తర్వాత ప్రయోగశాలలకు అవరోధం కలుగకుండా ఉండేందుకు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఐఎస్‌ఎస్‌ను కూల్చాలని నిర్ణయించింది. గడువు ముగిసే నాటికి దానిని ప్రస్తుత కక్ష్య నుంచి తప్పించనుంది.
స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం..
రాకెట్ల తయారీలో అంతరిక్ష అనుభవం గడించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు ఐఎస్‌ఎస్‌ను కూల్చే బాధ్యత అప్పగించాలని నాసా నిర్ణయించింది. ఈమేరకు స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం రూ.7,036 కోట్ల విలువైప కాంట్రాక్ట్‌ను స్పేస్ ఎక్స్‌కు ఇచ్చినట్లు నాసా బుధవారం(జూన్ 26న) అధికారికంగా ప్రకటించింది. కాంట్రాక్టులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికిల్(యూఎస్‌డీవీ)ను స్సేస్ ఎక్స్ నిర్మించనుంది.
400 కిలోమీటర్ల ఎత్తులో…
ఐఎస్‌ఎస్.. భూమి నుంచి ప్రస్తుతం 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువు ఉంది. దీనిని యూఎస్‌డీవీతో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలోకి తీసుకువస్తూ… ముందుగా నిర్దేశించిన పసిఫిక్ సముద్రంలోని మారుమూల ‘పాయింట్ నెమో’ వద్ద కూల్చేయనున్నారు. ఈ పాయింట్ నెమో నుంచి దగ్గర్లోని భూ భాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఈ ప్రాంతాన్ని నాసా ఎంపిక చేసింది.
వేల ప్రయోగాలకు వేదిక..
ఇదిలా ఉంటే ఐఎస్‌ఎస్.. వేల ప్రయోగాలకు వేదికైంది. దీనిని నిర్మించేందుకు 1998లో తొలి భాగాలను రాకెట్లలో తీసుకెళ్లారు. 2000 సంవత్సరం వరకు దీని నిర్మాణం సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్‌ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీనిని నిర్వహిస్తున్నాయి. 2028లో దీని నిర్వహణ నుంచి తప్పుకుంటామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిని కూల్చివేయడానికి నాసా సిద్ధమైంది.