Maruti Suzuki : మనదేశంలోనే అతిపెద్ద వాహనాలు తయారుచేసే మారుతి సుజుకి (Maruti Suzuki) సంస్థ ప్రస్తుతం రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కొరతతో ఇబ్బంది పడుతోంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను తయారుచేయడానికి వాడే ఈ అయస్కాంతాలను చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే, అక్కడ వీటి ఉత్పత్తి చాలా పరిమితంగా ఉంటుంది. ఇటీవల చైనా ప్రభుత్వం ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతిని ఆపేసింది. దీనితో మనదేశం పెద్ద చిక్కుల్లో పడింది. ఈ పరిస్థితి వల్ల వాహనాలు తయారుచేసే సంస్థలన్నీ ఎలా ముందుకెళ్లాలో అని ఆలోచిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మారుతి సుజుకి చాలా పరిష్కారాలను తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఉత్పత్తిపై ప్రభావం లేదు మారుతి ధీమా
మనదేశంలోని అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రస్తుతం పరిస్థితి కొంత అయోమయంగా ఉన్నప్పటికీ, తమ ఉత్పత్తి పై ఎటువంటి ప్రభావం పడలేదని ఆ సంస్థ చెప్పింది. “ప్రస్తుతం అనిశ్చితి ఉంది. పరిస్థితి నిరంతరం మారుతోంది. మేము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. మా కార్యకలాపాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చూసుకోవడానికి పరిష్కార మార్గాలను వెతుకుతున్నాం” అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. ఒకవేళ తమ వ్యాపారంపై ఏదైనా ప్రభావం పడితే రెగ్యులేటరీ నిబంధనలు అనుగుణంగా అన్ని స్టేక్‌హోల్డర్‌లకు సమాచారం అందిస్తామని కూడా ఆ సంస్థ చెప్పింది.
Also Read: Maruti : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? 5 లక్షల్లో బెస్ట్ ఆప్షన్స్ ఇవే
చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షలు
ప్రస్తుతం మనదేశంలోని వాహన రంగం కొత్త అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చైనా ప్రభుత్వం రేర్ ఎర్త్ మాగ్నెట్స్, ఇతర మాగ్నెట్ల ఎగుమతి మీద నిషేధం విధించింది. వాహనాలు, ఇంట్లో వాడే వస్తువులు వంటి వాటిలో ఉపయోగించే మాగ్నెట్స్ తయారీలో ప్రపంచ ఉత్పత్తిలో 90 శాతానికి పైగా చైనానే నియంత్రిస్తుంది. మనదేశం దిగుమతుల కోసం చైనా ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా వచ్చేలా ప్రభుత్వ మద్దతును కూడా కోరింది. సమారియమ్, గాడోలీనియం, టెర్బియమ్, డిస్ప్రోసియమ్, ల్యూటియమ్ వంటి ముఖ్యమైన పదార్థాలు ఎలక్ట్రిక్ మోటార్‌లు, బ్రేకింగ్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్లు, మిసైల్ టెక్నాలజీలో ఉపయోగపడతాయి. ఈ పరిస్థితి భారత వాహన రంగానికి ఒక సవాలుగా మారింది. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనడం అత్యవసరమే అని చెప్పాలి.