Iphone 17: ఆపిల్ కంపెనీ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాణ్యత.. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం.. అచంచలమైన అనుభవం ఆ కంపెనీ ఉత్పత్తుల సొంతం. అందువల్లే ప్రపంచంలో ఏ కంపెనీకి కూడా లేని బలమైన మార్కెట్ ఆపిల్ కు సొంతం. ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఫోన్ అందుబాటులోకి తీసుకొస్తుంది. అద్భుతమైన సౌకర్యాలను అందులో కల్పిస్తుంది. ఆ కంపెనీ తీసుకొచ్చే ఫోన్ అంటే చాలా మందికి విపరీతమైన క్రేజీ. దానిని సొంతం చేసుకోవడానికి అవసరమైతే దేశాలు కూడా దాటిపోతుంటారు. ఆ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్వాదించాలని బలంగా కోరుకుంటుంటారు. ఎంత ధర అయినా సరే చెల్లించి సొంతం చేసుకోవాలని ఉబలాట పడుతుంటారు.
ఆపిల్ కంపెనీ తను విడుదల చేసే ఫోన్ల విషయంలో ఎప్పటికప్పుడు కొత్తకొత్త సంగతులను పంచుకుంటూ ఉంటుంది. గతంలో తాను విడుదల చేసే ఫోన్లకు సంబంధించి వివిధ మాధ్యమాలలో ప్రకటనలు ఇచ్చేది. ఇప్పుడేమో సామాజిక మాధ్యమాలలో ప్రభావశీలమైన వ్యక్తుల ద్వారా తమ ఉత్పత్తులను ప్రచారం చేయించుకుంటున్నది. తాజాగా ఆపిల్ కంపెనీ సెప్టెంబర్ లో విడుదల చేయబోయే 17వ సిరీస్ ఫోన్లకు సంబంధించి ప్రమోషన్ మొదలు పెట్టింది. సెప్టెంబర్ 19న ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి. దీనికంటే ముందు తాను రూపొందించిన ఫోన్ రివ్యూ కోసం కొంతమంది ఔత్సాహిక సామాజిక మాధ్యమ ప్రభావశీలమైన వ్యక్తులకు ఇచ్చింది. వారు ఆ ఫోన్ పనితీరును తెలుసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేశారు. అందులో ఒక వ్యక్తి 17వ సిరీస్ ఫోన్ ను కారు టైర్ల కింద పెట్టాడు. ఆ కారును దాని మీదుగా పోనిచ్చాడు. దీంతో ఆ ఫోన్ స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. ఆ తర్వాత ఆ ఫోన్ చూపి అతడు.. స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. కారు భారాన్ని ఈ ఫోన్ తట్టుకోలేకపోయింది. ఎంతటి విపత్కర పరిస్థితి అయినా ఫోన్ తట్టుకుంటుందని చెప్పిన తయారీదారులు.. ఇప్పుడు ఏం చేస్తారంటూ ఆ వ్యక్తి ప్రశ్నించాడు.
ఐఫోన్ స్క్రీన్ ఇలా పగిలిపోయినప్పటికీ.. అమ్మకాలు మాత్రం జోరుగా ఉంటున్నాయని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ఆపిల్ కంపెనీ తన ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకువచ్చినప్పుడు ముందుగా అమెరికాలో విడుదల చేస్తుంది. ఈసారి అమెరికాతోపాటు భారతీయ మార్కెట్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా భారత్ లోనే ఆపిల్ తన ఉత్పత్తులను తయారుచేస్తోంది. చెన్నై, బెంగళూరులో ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. డ్రాగన్ నిపుణుల సహకారంతో వీటి తయారీ ప్రక్రియ చేపడుతోంది. అమెరికా కంటే కూడా మనదేశంలోనే ఎక్కువ ఆపిల్ ఉత్పత్తులు తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది.