Electric Vehicles: ఇంధన ధరలు పెరుగుతున్నాయి. వీటి ధర ఎంత దాకా వెళుతుందో కూడా తెలియదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం మనది. మన దేశ చమురు అవసరాల్లో 90% దిగుమతులే. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురును కామధేనువుగా వాడుకుంటున్నాయి. శుద్ధి పేరుతో ఎడపెడా పన్నులు వసూలు చేస్తూ జనాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇక కంపెనీలు ద్విచక్ర వాహనాల విడిభాగాల్లో కొన్నింటిని దిగుమతి చేసుకుంటుండటంతో వాటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ద్విచక్ర వాహనదారులకు ఈ – బైకులు ఆశా దీపంలా కనిపిస్తున్నాయి.
ప్రపంచమంతా చూస్తోంది
ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వైపే చూస్తోంది. ఇవి పర్యావరణహితంగా ఉండటం, రోజువారి నిర్వహణ సులభం కావడం వంటి కారణాలతో ఎక్కువమంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లలో ఇవి తొమ్మిది రెట్ల విక్రయాలను సాధించగలడమే దానికి నిదర్శనం. ఇదే సమయంలో సాధారణ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2019 పోలిస్తే 2021- 22లో 37% క్షీణించాయి. దీనిబట్టి రానున్న రోజుల్లో ఈవీ లకు మరింత ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని ఉత్పత్తిదారులు, డీలర్లు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sreeleela: రాఘవేంద్రరావు రుణాన్ని తీర్చుకోలేదట.. కుర్ర భామ కొత్త కబుర్లు
దేశవ్యాప్తంగా ఇలా
ఈవీలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తున్న దేశాల్లో భారతదేశానిది ఆరో స్థానం. ఈ జాబితాలో నార్వే, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, అమెరికా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. భారత దేశంలో హీరో ఎలక్ట్రిక్, ఒకినవా, యాంపియర్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2019 – 20 సంవత్సరానికి 24,843 ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయి. 2020-21 సంవత్సరానికి 41,046 వాహనాలు ఉత్పత్తి అయ్యాయి. వాస్తవానికి ఈ రెండేళ్లలో కరోనా తీవ్ర రూపం దాలచడంతో ఉత్పత్తి దాదాపుగా మందగించింది. కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో 2021- 22 సంవత్సరానికి రెండు లక్షల 2,31,338 వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సాధారణ ద్విచక్ర వాహనాలు విక్రయాలు మందగించాయి. 2019_ 20 సంవత్సరానికి గానూ 18,47,314 వాహనాలు అమ్ముడుపోయాయి. 2020- 21 సంవత్సరంలో 12,06,191 వాహనాల విక్రయాలు జరిగాయి. 2021-22 సంవత్సరానికి గాను 11,57,681 వాహనాల అమ్మకాలు జరిగాయి. వీటిలో హీరో కంపెనీకి సంబంధించిన వాహనాలే ఎక్కువగా అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో స్పోర్ట్స్ యు టిలిటీ వెహికల్స్ అమ్మకాలు పడిపోయాయి. ఈ సెగ్మెంట్ లో నంబర్ వన్ గా ఉన్న బజాజ్ ఈవీ లోకి వస్తోంది. హోండా కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గుర్గావ్ లో ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.
భారత్ లో ఇస్తున్న ప్రోత్సాహకాలు ఇవీ
ఈవీ ద్విచక్ర వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు భారత్ ఫే మ్ -టు అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలకు 50% వరకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఢిల్లీ వంటి రాష్ట్రాలు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నుల నుంచి మినహాయింపు ఇస్తోంది. 30 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక ఈ పథకం కింద ఒక్కో ద్విచక్ర వాహనానికి 30 వేల వరకు రాయితీ ఇస్తున్నట్టు డీలర్లు చెబుతున్నారు.
వాహనాలు దగ్ధమవుతున్నాయి
ఇంత వరకు బాగానే ఉన్నా ఈవీలు దగ్ధం అవుతుండడం కలవరానికి గురి చేస్తోంది. బ్యాటరీల్లో మార్పులు, వాహనాల ఆకృతి లో తేడాల వల్ల కాలిపోతున్నాయి. అయితే బండి ఛార్జింగ్ పెట్టిన అరగంట తర్వాతే నడపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం భారీగానే ఆహ్వానిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక నిబంధనలను సడలించింది. ప్రస్తుతం ఈవీ తయారీ పరిశ్రమల వల్ల సుమారు 50 వేల మందికి ఉపాధి లభిస్తోందని భారత పరిశ్రమల శాఖ చెబుతోంది.
భారత్ కచ్చిత నిబంధనలు
ఫేమ్ – టు పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అనేక రాయితీలు ఇస్తున్నది భారతదేశ ప్రభుత్వం.. నిబంధనల విషయంలోనూ అదే ఖచ్చితత్వాన్ని పాటిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారు అయిన టెస్లా మోటార్స్ భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. కానీ ఇక్కడే ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మెలిక పెట్టారు. అమెరికాలో తయారుచేసిన విడిభాగాలను ఇక్కడికి తీసుకొచ్చి అసెంబ్ల్డ్ చేసి విక్రయిస్తామని చెప్పారు. దీనికి భారత్ ఒప్పుకోలేదు. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ కావడంతో ఎలన్ మస్క్ భారత ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారు. అందులో అంతరార్థాన్ని గుర్తించక తన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ట్విట్టర్ వేదికగా ఆహ్వానించారు. కానీ దానికి మస్క్ సానుకూలంగా స్పందించలేదు. టెస్లా ఉదంతం తర్వాత భారత ప్రభుత్వం దేశీయ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చింది. అధునాతన పరిజ్ఞాన్ని అందిపుచ్చుకునేందుకు నిష్ణాతులైన ఇంజనీర్లతో సమావేశాలు నిర్వహించింది. ఫలితంగా ఎటువంటి లోపాలు లేని వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నాడు భారత్ అతిపెద్ద ఈవీ ఉత్పత్తిదారుగా అవతరించే అవకాశాలు లేకపోలేదు.
Also Read:Chiranjeevi- Balakrishna: బాలయ్యకి పోటీగా మెగాస్టార్.. మరీ దీనిలో కూడా పోటీనా ?