DND Mode : ప్రస్తుత డిజిటల్ యుగంలో అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు, అలర్ట్‌లు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అత్యవసర మీటింగ్‌లో ఉన్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఈ పదే పదే వచ్చే రింగ్‌టోన్‌లు, నోటిఫికేషన్‌లు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు తయారు చేసే దాదాపు అన్ని కంపెనీలు కస్టమర్ల సౌలభ్యం కోసం ఒక ఫీచర్‌ను అందిస్తాయి. అదే DND మోడ్. ఈ మోడ్ అలాంటి అన్ని సమస్యలను దూరం చేస్తుంది. అసలు DND మోడ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? దీని పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
DND మోడ్ అంటే ఏమిటి?
DND పూర్తి పేరు ‘డూ నాట్ డిస్టర్బ్’ (Do Not Disturb). ఈ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు మీ ఫోన్‌కు వచ్చే కాల్‌లు, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు మ్యూట్ అవుతాయి. అంటే మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. మీరు కావాలంటే కొన్ని ముఖ్యమైన నంబర్లను మినహాయించి మిగిలిన అన్ని అలర్ట్‌లను ఆఫ్ చేయవచ్చు. మీకు అవసరమైన యాప్‌ల నోటిఫికేషన్‌లను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని ఆఫ్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో DND మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో DND మోడ్‌ను ఆన్ చేయడానికి, ముందుగా ఫోన్ సెట్టింగ్స్ ఆన్ చేయాలి. తర్వాత ‘సౌండ్ అండ్ వైబ్రేషన్’ లేదా ‘నోటిఫికేషన్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేయాలి. కావాలంటే షెడ్యూల్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందులో రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు సమయాన్ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఎవరు కాల్ చేయవచ్చు.. చేయవద్దో కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫోన్‌లలో DND షార్ట్‌కట్ డైరెక్ట్‌గా నోటిఫికేషన్ ప్యానెల్‌లో (పై నుండి క్రిందికి లాగితే వచ్చేది) కూడా ఉంటుంది.
ఐఫోన్‌లో DND మోడ్‌ను ఎలా ఆన్ చేయాలి?
మీరు ఐఫోన్ యూజర్ అయితే, ఐఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. తర్వాత ‘ఫోకస్’ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేయండి. ‘అలౌడ్ నోటిఫికేషన్స్’ లో మీరు DND మోడ్‌లో కూడా ఎవరి కాల్‌లు లేదా మెసేజ్‌లను అంగీకరించాలనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేయాలి. మీరు ఆండ్రాయిడ్ లాగానే ఇందులో కూడా టైమ్ షెడ్యూల్ చేయవచ్చు. ఐఫోన్‌లో కంట్రోల్ సెంటర్ నుంచి కూడా DNDని ఆన్/ఆఫ్ చేయవచ్చు.