ChatGPT History Problem: అప్పటికప్పుడు నచ్చిన అంశం ఆధారంగా ఫోటో కావాలి.. చాట్ జిపిటి ఇచ్చేస్తుంది.. ఏదైనా అంశానికి సంబంధించి వ్యాసం కావాలి.. చాట్ జిపిటి రాస్తుంది.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కు సంబంధించి వాస్తవాలు తెలియాలి.. చాట్ జిపిటిని అడిగితే చెబుతుంది.. ఇలా ప్రతి అంశానికి ఇటీవల కాలంలో చాట్ జిపిటిని వాడటం పరిపాటిగా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా తెలియని అంశానికి సంబంధించి సమాచారం కావాలంటే గూగుల్ మీద ఆధారపడేవారు. ఇప్పుడు కృత్రిమ మేధ తో పనిచేసే చాట్ జిపిటి మీద ఆధార పడాల్సి వస్తోంది.
2022లో చాట్ జిపిటి తెరపైకి వచ్చింది. అప్పట్లో కృత్రిమ మేధ అందరికీ ఒక ఆశ్చర్యం లాగా అనిపించింది. మొదట్లో దీనిపై చాలామందికి అంతగా అవగాహన ఉండేది కాదు. క్రమక్రమంగా దీనికి అలవాటు పడిన తర్వాత.. ఇప్పుడు ఇది లేకుండా ఉండలేకపోతున్నారు. ప్రతి అంశానికి చాట్ జిపిటి మీద ఆధారపడుతున్నారు. చాట్ జిపిటి వల్ల టెక్నాలజీలో సమూల మార్పులు ఏర్పడ్డాయి.. ఓపెన్ ఏఐ రూపొందించిన ఈ కృత్రిమ ఆధారిత చాట్ బాట్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కాదు. 2022లో అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికత.. కేవలం మూడు సంవత్సరాలలోనే సరికొత్త మార్పులకు గురైంది. వాడుతున్న వారికి అద్భుతమైన సాంకేతిక అనుభవాన్ని అందిస్తున్నది.. ప్రపంచ వ్యాప్తంగా చాట్ జిపిటి సేవలను చాలామంది వాడుతున్నారు.. చాట్ జీపీటీ టెక్నాలజీ రంగంలో సంచలనం. దీని తర్వాత గూగుల్, మెటా, ఎక్స్ వంటివి సరికొత్త సేవలను అందుబాటులో తీసుకొచ్చాయి. ఇవన్నీ కూడా కృత్రిమ మేధ ఆధారంగానే పనిచేస్తాయి.
Also Read: New UPI Rules: డబ్బు కట్ అయితే టెన్షన్ అక్కర్లేదు.. నేటి నుంచి యూపీఐ కొత్త రూల్
కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్ జిపిటి టెక్నాలజీ రంగంలోనే ఒక సంచలనం.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది చాట్ జిపిటి వాడుతున్నారు. చాట్ జిపిటి సేవలకు అంతరాయం ఏర్పడటం యూజర్లకు ఇబ్బంది కలిగిస్తోంది..చాట్ జిపిటి ఓపెన్ చేస్తుంటే హిస్టరీ లోడ్ అవ్వడం లేదు. చాట్ బాట్ లో కూడా ఎర్రర్లు వస్తున్నాయి. దీంతో యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..చాట్ చేయాలని ప్రయత్నిస్తుంటే అసాధారణమైన ఎర్రర్ మెసేజ్ లు వస్తున్నాయని యూసర్లు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు మొత్తం ఈ సమస్య ఎదురయింది. దాదాపు 82 శాతం మంది యూజర్లు ఈ సేవలను పొద్దలేకపోతున్నారు.. అయితే ఈ సమస్యను గుర్తించామని ఓపెన్ ఏఐ ప్రకటించింది. చాట్ జిపిటి రికార్డు మోడ్, సోరా, కోడెక్స్ సేవలను అంతరాయం ఏర్పడటం వల్లే ఇలా జరిగిందని ఓపెన్ ఏఐ సిబ్బంది చెబుతున్నారు..చాట్ జిపిటి సేవలు నిలిచిపోవడం ఇది రెండవసారి. చాట్ జిపిటి 2022లో మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు అనేక మార్పులకు గురైంది. అద్భుతమైన సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ టెక్నాలజీ పై అతిగా ఆధారపడటం మంచిది కాదని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్ ఇటీవల హెచ్చరించడం విశేషం.