New UPI Rules: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.. యూపీఐ.. ఇది వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ ప్రపంచాన్ని మార్చేసింది. సెకన్లలో డబ్బు పంపడం, స్వీకరించడం దీని ప్రత్యేకత. యూపీఐ వచ్చిన తర్వాత ప్రజలు డబ్బులు జేబుల్లో పెట్టుకోవడమే మానేశారు. బడా బడా మాల్స్ నుంచి వీధి వ్యాపారాల వరకు ఏ వస్తువు కొన్నా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. అయితే, అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్లు విఫలమై, అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంటాయి. ఈ సమయంలో వినియోగదారులు కంగారు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేటి నుంచి (జూలై 15) యూపీఐ ఛార్జ్‌బ్యాక్ రూల్స్ కంప్లీట్ గా మార్చేసింది. ఈ కొత్త మార్పుల వల్ల ఇకపై యూపీఐ యూజర్లు మనీ ట్రాన్సాక్షన్ల వివాదాలకు చాలా తక్కువ సమయంలోనే పరిష్కారం పొందనున్నారు.
Also Read: సుకుమార్ శిష్యులు ఆయన కంటే స్టార్ డైరెక్టర్లు అవుతారా..?
ఛార్జ్‌బ్యాక్ అంటే ఏమిటి?
యూపీఐ ద్వారా మనం ఎవరికైనా డబ్బు పంపినప్పుడు, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినప్పటికీ, అవతలివారికి చేరదు. దీనినే సాధారణంగా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో, మన డబ్బును తిరిగి పొందడానికి ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ ఇలాంటి సమస్యలకు వేగంగా పరిష్కారం చూపనున్నాయి.
టైం ఆదా, వేగవంతమైన పరిష్కారం
గతంలో ఇలాంటి సమస్యలకు పరిష్కారం రావాలంటే కనీసం 5-6 రోజులు పట్టేది. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు, ఎన్‌పీసీఐ ఈ ప్రక్రియను ఒకట్రెండు రోజులకు తగ్గించింది. అంటే, మీరు కంప్లైంట్ చేసిన తర్వాత 24-48 గంటల్లోనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి.
బ్యాంకులకు పెరిగిన అధికారాలు
ఈ కొత్త విధానంలో ఎన్‌పీసీఐ అనవసరమైన కొన్ని దశలను తొలగించింది. గతంలో, ఛార్జ్‌బ్యాక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు బ్యాంకులు ఎన్‌పీసీఐని ‘వైట్‌లిస్ట్’ చేయమని మళ్ల రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ ప్రక్రియ అవసరం లేదు. బ్యాంకులు నేరుగా ఈ సమస్యలను పరిష్కరించుకునే ఫ్రీడమ్ కలిగి ఉన్నాయి.
పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్లు : మీరు మరొక వ్యక్తికి డబ్బు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే, రీఫండ్ చేయడానికి బ్యాంకులకు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంటుంది. అంటే, ఈరోజు కంప్లైంట్ చేస్తే, రేపటిలోగా మీ డబ్బు తిరిగి రావాలి.
వ్యాపారులకు చేసిన పేమెంట్స్ : ఏదైనా వ్యాపారికి చేసిన పేమెంట్ ఫెయిల్ అయితే రీఫండ్ చేయడానికి బ్యాంకులకు రెండు రోజుల గడువు ఉంటుంది.
ఈ మార్పుల వల్ల లాభాలేంటి?
ఈ కొత్త రూల్స్ యూపీఐ యూజర్లకు చాలా బెనిఫిట్స్ అందిస్తాయి. ముఖ్యంగా, ఆర్థిక లావాదేవీల్లో తలెత్తే అపనమ్మకాన్ని తగ్గిస్తాయి. యూపీఐ ట్రాన్సాక్షన్లు మరింత సేఫ్ గా మారుతాయి. డబ్బు పోయిందేమో అనే భయం తగ్గుతుంది, ఎందుకంటే సమస్యకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. అనవసరమైన ప్రక్రియలు తొలగించడం వల్ల బ్యాంకులు కూడా తక్కువ సమయంలో ఎక్కువ కంప్లైంట్స్ పరిష్కరించగలుగుతాయి. ఈ మార్పులు యూపీఐని భవిష్యత్తులో మరింత విస్తరించడానికి, డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తాయి.
యూపీఐ భారతదేశంలో వేగంగా విస్తరించింది. ఎన్‌పీసీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ 2025 నెలలో యూపీఐ ద్వారా 18.4 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వీటి విలువ సుమారు రూ.24.04 లక్షల కోట్లు. రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య కూడా పెరుగుతోంది. మే నెలలో రోజుకు సగటున 602 మిలియన్ లావాదేవీలు జరిగితే, జూన్ నెలలో అది 613 మిలియన్లకు చేరింది. ఈ భారీ లావాదేవీల సంఖ్యలో కొన్ని ఫెయిల్ కావడం, వినియోగదారులకు రీఫండ్ లేట్ కావడం వంటి సమస్యలు రావడం సహజం. ఈ సమస్యలను పరిష్కరించడానికే ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.