WhatsApp: వాట్సప్ వాడుతున్న వారు హ్యాకర్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. మోసానికి గురికారని తెలుస్తోంది. అయితే సైబర్ నేరగాళ్ల మోసాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరగాళ్లు వాట్సప్ హ్యాకింగ్ ఎలా చేస్తారు? మోసానికి ఎలా పాల్పడతారు? డబ్బులు ఎలా వసూలు చేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
మోసం ఇలా చేస్తారు
సైబర్ నేరగాళ్లు డార్క్ వెబ్ ద్వారా వాట్సాప్ నెంబర్లను కొనుగోలు చేస్తున్నారు. వాటి ఆధారంగా వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత తమ ప్లాన్ అమల్లో పెట్టి మోసం చేస్తున్నారు. సాధారణంగా ఒక కస్టమర్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ మరో ఫోన్లో కచ్చితంగా యాక్టివేట్ కావాలంటే.. యాక్టివేషన్ కోడ్ అనేది కంపల్సరీ.. అందువల్లే సైబర్ నేరగాళ్లు తమ వద్ద ఉన్న ఫోన్లో వాట్స్అప్ ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానిని యాక్టివేట్ చేసి.. ఎవరినైతే మోసం చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ఓటిపి అసలైన వ్యక్తుల మొబైల్ నెంబర్ కు వెళ్లగానే.. సైబర్ నేరగాళ్లు ఆ నెంబర్ కు ఫోన్ చేస్తున్నారు. తాము ఒక సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటుండగా.. పొరపాటున మీ నెంబర్ ఎంటర్ అయిందని.. అందువల్ల మాకు రావాల్సిన ఓటిపి మీ నెంబర్ కు వచ్చిందని.. దానిని చెప్పాలని కోరుతున్నారు. అయితే ఇందులో ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం లేకపోవడంతో బాధితులు సులువుగా నమ్ముతున్నారు. వారు అడగ్గానే ఆ ఓటిపి నెంబర్ చెబుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు అప్పటికే పూర్తి చేసుకున్న వాట్సప్ లో దానిని ఎంటర్ చేస్తున్నారు.
తర్వాత ఏం జరుగుతుందంటే
ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత బాధితుడి నెంబర్ ద్వారా పనిచేసే వాట్సాప్ సైబర్ నెరగాడి ఫోన్లో ఆక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత వాట్సప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి టూ స్టెప్ వెరిఫికేషన్ కు సైబర్ నేరగాళ్లు మారుస్తున్నారు. ఆ తర్వాత బాధితుల వాట్సప్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. అనంతరం వాట్సప్ బ్యాకప్ ద్వారా బాధితుడి కాంటాక్టులు, ఇతర వివరాలు సైబర్ నేరగాళ్లు డౌన్లోడ్ చేసుకుంటారు. బాధితుడి కాంటాక్టుల ఆధారంగా అతడి స్నేహితులు, సన్నిహితులను గుర్తించి బాధితులు పంపినట్టే సందేశాలు పంపిస్తుంటారు. వైద్య అవసరాల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బ్యాకప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఆయా వ్యక్తులు ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్టు చూపిస్తున్నారు. కొన్ని కాంటాక్టులకు వాట్సప్ క్యూఆర్ కోడ్ పంపి స్కాన్ చేయించి.. వాట్సప్ ఆధీనంలో తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. అప్పటికే బాధితుడి వాయిస్ ఆధారంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించి.. వారికి దగ్గర వ్యక్తులకు, బంధువులకు ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్నామని డబ్బులు లాగుతున్నారు.. మరికొందరైతే ఫోటోలను మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఇలా చేస్తే ఓకే
సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దు అనుకుంటే.. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అందులో టూ స్టెప్ వెరిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ఒకవేళ ఆ నెంబర్తో కూడిన వాట్సాప్ ను సైబర్ నేరస్తులు మరో ఫోన్లో ఆక్టివేట్ చేసేందుకు… ప్రయత్నించినప్పటికీ వినియోగదారులు ముందుగానే రూపొందించి పెట్టుకున్న ఆరు అంకెల యాక్టివేషన్ పిన్ నెంబర్ వారికి తెలియకపోవడం వల్ల.. ఇతర ఫోన్లో యాక్టివేట్ కాదు.
సాధ్యమైనంత వరకు యూజర్లు తమ డిపి లను, స్టేటస్ లను కేవలం కాంటాక్ట్ లకు మాత్రమే కనిపించే విధంగా జాగ్రత్త పడాలి.
చాట్ బ్యాక్అప్ తగ్గించుకోవడమే మంచిది. అందుకే వాట్స్అప్ సెట్టింగ్స్ లో డౌన్లోడ్ ఆప్షన్ ను నన్ అని ఎంపిక చేసుకొని ఆక్టివేట్ చేసుకోవాలి.. ఎట్టి పరిస్థితుల్లో ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ మాత్రమే ఎంచుకోవద్దు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉండడంవల్ల ఫోటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను మాల్ వేర్ రూపంలో పంపించే ప్రమాదం ఉంది. తద్వారా యూజర్ ప్రమేయం లేకుండానే ఆ వైరస్ ఫోన్లో ఇన్ స్టాల్ అవుతుంది.