Delhi Earthquake: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. తెల్లవారుజామున 5:36 గంటలకు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ఆందోళనకు గురైన జనం రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గాంలోనూ భూమి కంపించింది. అయితే ఎలాంటి నష్టం జరుగలేదు. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఢిల్లీ పోలీసులు హెల్ప్‌లైన్ నంబర్ 112 ఏర్పాటు చేశారు. భూకంప కేంద్రం ఢిల్లీలోనే ఉందని, భూమి నుంచి 5 కిలోమీటర్ల లోతులోనే ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఎలాంటి సాయం కావాలన్నా 112 నంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
జనవరి 23న చైనాలో..
ఇదిలా ఉంటే.. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో జనవరి 23న భూకంపం వచ్చింది. భూమి ఉపరితలం నుంచి 80 కిలోమీర్లలోతులో 7,2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవవంచింది. దీని ప్రభావంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భూకంపం జోనేషన్ మ్యాప్ ప్రకారం.. తాజా ప్రకంపనల తీవ్రత 4.0 అని జోన్ 4 పరిధిలోకి వస్తుందని, వెల్లడించింది. దీంతో భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంది.
ధైర్యం చెప్పిన మోదీ..
ఢిల్లీలో భూకంపంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రజలంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రతా చర్యలు పాటించాలని పేర్కొన్నారు. పరిస్థితులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని వెల్లడించారు.