WhatsApp: వాట్సాప్ లో కొత్త ఫీచర్.. యూజర్లకు ఆ ఇబ్బంది తొలగిపోయినట్టే..

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత.. వాట్సాప్ అనేది అత్యవసరమైపోయింది. మెసేజ్, ఫోటోలు, వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్.. ఇలా ఒక్కటేమిటి చాలా.. మంచి వెనుక చెడు ఉన్నట్టు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 21, 2024 5:08 pm

WhatsApp

Follow us on

WhatsApp: వాట్సాప్.. ఈ అప్లికేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గురించి వివరించాల్సిన పని అంతకన్నా లేదు. 2.78 బిలియన్ యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా అవతరించింది. దీనికి సంబంధించి యాక్టివ్ యూజర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా వారి అవసరాలకు అనుగుణంగా మెటా కంపెనీ కొత్త కొత్త ఫీచర్లు యాడ్ చేసుకుంటూ వస్తోంది. అందువల్లే ఈ మెసేజింగ్ యాప్ ఈ స్థాయిలో విజయవంతమైంది.

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత.. వాట్సాప్ అనేది అత్యవసరమైపోయింది. మెసేజ్, ఫోటోలు, వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్.. ఇలా ఒక్కటేమిటి చాలా.. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఈ వాట్సప్ వినియోగం పెరిగిన తర్వాత గ్రూపుల బెడద ఎక్కువైపోయింది. ఫలితంగా ఒకేసారి వందల కొద్ది మెసేజ్ లు రావడం పెరిగిపోయింది. దీంతో చాలామంది ఇబ్బందికి గురవుతున్నారు. గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే ఒక బాధ.. ఎగ్జిట్ కాకుంటే మరో బాధ. ఇలాంటప్పుడు ఏదో ముఖ్యమైన మెసేజ్ వస్తే.. ఈ హడావిడిలో దాన్ని చూసే పరిస్థితి ఉండదు. వందల కొద్ది మెసేజ్ రాగానే ఆ చాట్ వెంటనే కిందికి వెళ్ళిపోతుంది. ఫలితంగా అవతలి వ్యక్తి పంపిన మెసేజ్ మనం చూసే పరిస్థితి ఉండదు.

ఈ నేపథ్యంలో యూజర్ల సాలభ్యం కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. చాట్ ఫిల్టర్ పేరుతో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్టు వాట్సప్ మాతృ సంస్థ మెటా ప్రకటించింది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మిగతా వారికి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని మెటా వివరించింది. ఆండ్రాయిడ్ 12.22.16.14 వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పిన మెటా… మిగతా ఆండ్రాయిడ్ యూజర్లందరికీ త్వరలో అందుబాటులోకి తీసుకురానంది. మెటా కంటే ముందు గూగుల్ సంస్థ 2020లో జీ – మెయిల్ లో ఇలాంటి ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్లో మూడు రకాల ఆప్షన్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయని మెటా సంస్థ చెబుతోంది.

వాట్సాప్ లో వచ్చే మెసేజ్ లను ఆల్, అన్ రీడ్, గ్రూప్స్ అనే మూడు కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఆల్ కేటగిరిలో మనకు వచ్చిన అన్ని మెసేజెస్ కనిపిస్తాయి. ఇక చదవకుండా వదిలేసిన మెసేజ్ లను అన్ రీడ్ విభాగంలో వీక్షించవచ్చు. అలాగే మూడో ఆప్షన్ గ్రూప్ కేటగిరీలో.. కేవలం వాట్సాప్ గ్రూపులకు సంబంధించిన చాట్స్ మాత్రమే అందులో డిస్ ప్లే అవుతాయి. ఈ మూడు విభాగాల వల్ల యూజర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాట్సప్ వినియోగించవచ్చని చెబుతోంది. వీటిని మాత్రమే కాకుండా వాట్సాప్ లో యాక్టివ్ గా లేని యూజర్లను గుర్తించి మరో ఫీచర్ కూడా అందుబాటులోకి తెస్తామని మెటా చెబుతోంది.