Site icon OkTelugu

Meta Creator Monetization Program 3000 Dollars: చేతులు కాలాక ‘మెటా’ ఆకులు పట్టుకుంటే.. ఫేస్‌బుక్ ‘కాసుల’ గాలానికి క్రియేటర్లు చిక్కుతారా?

Meta Creator Monetization Program 3000 Dollars

Meta Creator Monetization Program 3000 Dollars

Meta Creator Monetization Program 3000 Dollars: “ఇల్లు అలకగానే పండుగ కాదు.. అకౌంట్లో మూడు వేల డాలర్లు వేయగానే క్రియేటర్లు రారు!” – ప్రస్తుతం సోషల్ మీడియా లోకంలో ఫేస్‌బుక్ పరిస్థితి చూస్తుంటే ఇదే సామెత గుర్తొస్తోంది. ఒకప్పుడు తన ప్లాట్‌ఫామ్‌ను నమ్ముకున్న క్రియేటర్లకు ‘చిల్లిగవ్వ’ విదల్చకుండా, కేవలం లైకులు, షేర్లతోనే పొట్ట నింపుకోమన్న ఫేస్‌బుక్, ఇప్పుడు క్రియేటర్లంతా పక్కదారి పట్టాక ‘కంటెంట్ ఫాస్ట్ ట్రాక్’ అంటూ కొత్త నాటకానికి తెరలేపింది.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

అప్పుడు అహంకారం.. ఇప్పుడు అడుక్కునే స్థితి!

యూట్యూబ్ తన లాభాల్లో వాటా ఇస్తూ క్రియేటర్లను కోటీశ్వరులను చేస్తోంటే, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో రచ్చ చేస్తోంటే.. ఫేస్‌బుక్ మాత్రం తన 3 బిలియన్ల యూజర్ బేస్ చూసుకుని మురిసిపోయింది. “మా దగ్గర యూజర్లు ఉన్నారు, మీరు కంటెంట్ ఫ్రీగా ఇచ్చుకోవాల్సిందే” అన్నట్టుగా వ్యవహరించిన ఫేస్‌బుక్ వైఖరితో విసిగిపోయిన క్రియేటర్లు.. మూటాముల్లె సర్దుకుని టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్ వంటి పచ్చని చెట్ల కిందకు చేరిపోయారు. ఇప్పుడు అక్కడ వాళ్లు స్థిరపడ్డాక, ఫేస్‌బుక్ తన ఖాళీగా ఉన్న ‘గోడల’ను చూసుకుని భయపడి, నెలకు 3,000 డాలర్లు ఇస్తానంటూ ఆశ చూపిస్తోంది.

ఆఫర్ అదిరింది.. కానీ లాజిక్ ఎక్కడ?

మెటా ప్రకటించిన ఈ 3,000 డాలర్ల ఆఫర్ వింటే ‘బిచ్చగాడు’ సినిమాలో హీరో లాగా.. “మూడు నెలలేనా నాయనా?” అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కీమ్ కేవలం 90 రోజులు మాత్రమే! “మూడు నెలలు మేత వేసి, ఆ తర్వాత కోత కోస్తారా?” అని ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రశ్నిస్తున్నారు. నెలకు 15 క్వాలిటీ రీల్స్ చేయాలంటే, ఒక్కో దానికి వచ్చే 200 డాలర్లు కనీసం లైటింగ్ ఖర్చులకు కూడా సరిపోవు. ప్రస్తుతం ఫేస్‌బుక్ అంటే కేవలం ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పంపే తాతయ్యలు, ఫ్యామిలీ గ్రూపులకే పరిమితమైపోయింది. అక్కడ కొత్త క్రియేటర్లు వచ్చి ఏ యుద్ధం చేస్తారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

‘సిడ్ మెన్’ లాంటి వాళ్ల రియాక్షన్: “వస్తాం.. కానీ ఉండం!”

ప్రముఖ క్రియేటర్లు కూడా ఫేస్‌బుక్ ఆఫర్‌ను ఒక ‘సైడ్ బిజినెస్’ లాగే చూస్తున్నారు. వేరే ఎక్కడో వండిన కూరను (కంటెంట్‌ను) తెచ్చి ఫేస్‌బుక్ ప్లేట్‌లో వడ్డిస్తారే తప్ప, ఈ ప్లాట్‌ఫామ్ కోసం ప్రత్యేకంగా వంటలు చేసే (వీడియోలు తీసే) ఓపిక ఎవరికీ లేదు.

వయసు అయిపోయిన తర్వాత పెళ్లి సంబంధాలు చూసుకున్నట్టుంది ఫేస్‌బుక్ వ్యవహారం. యువత అంతా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఎక్స్‌లో గొడవపడుతూ యూట్యూబ్‌లో సంపాదిస్తూ బిజీగా ఉంటే.. ఫేస్‌బుక్ మాత్రం “మళ్లీ రండి.. కాఫీ తాగి వెళ్లండి” అన్నట్టుగా 3,000 డాలర్ల బిస్కెట్లు వేస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్న ఈ ‘కంటెంట్ ఫాస్ట్ ట్రాక్’.. ఫేస్‌బుక్‌ను మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కిస్తుందో లేక ‘ఫాస్ట్’గా మూతపడేలా చేస్తుందో వేచి చూడాలి!

Exit mobile version