Sarvesh Singh: ఆయన వయసు 72 సంవత్సరాలు.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇటీవల మొదటి దశలో ఆయన పోటీ చేస్తున్న పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగాయి.. కానీ, పోలింగ్ జరిగిన మరుసటి రోజే ఆయన మృతి చెందారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా విషాదం అలముకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ పార్లమెంటు స్థానానికి తొలి దశ ఎన్నికల్లో పోలింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా సీనియర్ నాయకుడు కున్వర్ సర్వేష్ సింగ్ పోటీలో ఉన్నారు.. ఇటీవల నామినేషన్ కూడా ఉత్సాహంగా దాఖలు చేశారు. ప్రచారంలో కూడా పాల్గొన్నారు. కానీ అనుకోకుండా అనారోగ్యానికి గురై ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆ నియోజకవర్గానికి పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఆయన కన్నుమూశారు.. దీంతో మొరాదాబాద్ నియోజకవర్గంలో విషాదం నెలకొంది. కున్వర్ సర్వేష్ సింగ్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పని చేశారు.
80 పార్లమెంటు స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో.. 2019లో జరిగిన ఎన్నికల్లో మొరాదాబాద్ స్థానంలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఎస్టి హసన్ విజయం సాధించారు. కున్వర్ సర్వేష్ సింగ్ 2014లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కున్వర్ సర్వేష్ సింగ్.. సమాజ్ వాది పార్టీ అభ్యర్థి రుచి వీర, బహుజన్ సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఇర్ఫాన్ సైఫీతో పోటీపడ్డారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 48 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. కున్వర్ సర్వేష్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కున్వర్ సర్వేష్ సింగ్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఒక లేఖ రాశారు. ” మా మొరాదాబాద్ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మృతిచెందడం బాధాకరం. ఆయన లేడనే వార్త తెలుసుకొని చాలా షాక్ కు గురయ్యాను. ఇది భారతీయ జనతా పార్టీకి తీరని నష్టం. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. రామచంద్ర ప్రభు ఆయన కుటుంబాన్ని కాపాడతాడని ఆశిస్తున్నానని” యోగి ఆ లేఖలో పేర్కొన్నారు.
సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా కున్వర్ సర్వేష్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఎస్టి హసన్, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రుచి వీర కూడా సంతాపం వ్యక్తం చేశారు. “కున్వర్ సర్వేష్ సింగ్.. విలువలు ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన మరణం బాధాకరం. మొరాదాబాద్ ప్రజలకు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి. ఆయన లేని నష్టాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని” యోగి తన సంతాపంలో ప్రకటించారు.