Jahir Khan : గౌతమ్ గంభీర్ స్థానాన్ని ఆక్రమించేందుకు జహీర్ ఖాన్ ప్రయత్నాలు..

ఒకప్పుడు క్రికెట్ లో పరిమిత సంఖ్యలో టోర్నీలు జరుగుతుండేవి. దీంతో మీడియాకు ఎక్కువగా పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు క్రికెట్ విస్తృతమైన తర్వాత.. రోజుకో తీరుగా సంచలన వార్త బయటకు వస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 21, 2024 1:28 pm

Jahir khan

Follow us on

Jahir Khan :  టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ లో అతడు మెంటార్ గా వ్యవహరించిన కోల్ కతా జట్టు విజేతగా ఆవిర్భవించింది. 2014 తర్వాత మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలో కోల్ కతా జట్టు తిరుగులేని ప్రదర్శన ఇచ్చింది. ఐపీఎల్ లో మేటి జట్లను పడుకోబెట్టింది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసి.. దర్జాగా ట్రోఫీ అందుకుంది. ఐపీఎల్ లో కోల్ కతా జట్టు రూపురేఖలు మార్చిన నేపథ్యంలో.. గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ టీమ్ ఇండియాకు కోచ్ గా నియమించింది. ఇందులో భాగంగా ఆయనకి రాహుల్ ద్రావిడ స్థాయిలోనే ప్యాకేజీ, ఇతర భత్యాలను అందిస్తోంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసింది. వన్డే సిరీస్ మాత్రం కోల్పోయింది. అయితే త్వరలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఆటగాళ్లకు తర్ఫీదు ఇచ్చే పనిలో గౌతమ్ గంభీర్ నిమగ్నమయ్యాడు. సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో సమూల మార్పులు చేపట్టాడు.

గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టు కంటే ముందు లక్నో జట్టుతో కలిసి ప్రయాణం సాగించాడు.. ఆ జట్టుకు మెంటార్ గా సేవలు అందించాడు.. ఆ సీజన్లో లక్నో జట్టు గ్రూప్ దశలో అద్భుతమైన ప్రతిభ చూపింది. ఏకంగా సెమీస్ దాకా వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఆశించినత స్థాయిలో ప్రదర్శన చేయలేదు. పైగా లక్నో జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్, ఆ జట్టు యజమాని తో గొడవ జరిగిందనే వార్తలు మీడియాను హోరెత్తించాయి. ఈ క్రమంలో వచ్చే సీజన్ కు సంబంధించి కొత్త మెంటార్ ను నియమించుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. జహీర్ ఖాన్ టీమిండియాలో ఒకప్పుడు స్టార్ బౌలర్ గా అవతరించాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి.. టీమిండియా సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ఇక లక్నో జట్టుకు బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కల్ ఉండేవాడు. ప్రస్తుతం అతడు టీమిండియా బౌలింగ్ కోచ్ గా మారాడు. అయితే గౌతమ్ గంభీర్ మోర్కెల్ ను ఏరికోరి టీమిండియా బౌలింగ్ కోచ్ గా నియమించడం విశేషం. ప్రస్తుతం అతడు టీమిండియా ఆటగాళ్ల బౌలింగ్ శైలి మార్చేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. కేవలం ఒకరిద్దరి బౌలర్ల మీద జట్టు ఆధారపడకుండా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాడు.