Yuvraj Singh: టి20 ప్రపంచ కప్ మదిలో మెదిలితే చాలు.. అందరికీ యువరాజ్ సింగ్ 2007 లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై కొట్టిన వరుస ఆరు సిక్సర్లు గుర్తుకు వస్తాయి.. టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఆటగాళ్లు ఎన్ని రికార్డులు సృష్టించినా యువరాజ్ సింగ్ ఘనతను మాత్రం చెరిపి వేయలేరు. ఎందుకంటే చరిత్ర పుటల్లో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు ఈ పంజాబ్ కింగ్. క్యాన్సర్ వ్యాధిని జయించి మరీ 2011 లో టీమ్ ఇండియా వరల్డ్ కప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ కు అతడు అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా 2007 t20 వరల్డ్ కప్ మ్యాచ్లో తాను కొట్టిన ఆరు సిక్సర్ల ఘనతపై యువరాజ్ సింగ్ నోరు విప్పాడు. ముందుగా ఐదు సిక్సర్లు మాత్రమే కొట్టాలని యువరాజ్ అనుకున్నాడట.. కానీ, ఆరో సిక్సర్ కొట్టడం తనకు గొప్ప అనుభూతి అని యువరాజ్ పేర్కొన్నాడు. తాను అలా చెలరేగేందుకు కారణం కూడా ఏంటో యువరాజ్ బయట పెట్టాడు.
‘దిమిత్రి మస్కరైనాస్ అనే ఆటగాడు నా బౌలింగ్లో ఐదు సిక్స్ లు కొట్టాడు. అది నాలో కసిని పెంచింది. నేను కూడా 5 సిక్సర్లు కొట్టాలని నిర్ణయించుకున్నాను. 2007లో జరిగిన తొలి టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో మేము ఇంగ్లాండ్ జట్టుతో తలపడ్డాం. నాకు బ్యాటింగ్ చేసే వంతు వచ్చింది. మైదానం ప్లాట్ గా ఉండడంతో బ్యాటింగ్ చేసేందుకు సులువుగా ఉంది. అయితే నేను వరుసగా 5 సిక్సర్లు కొట్టాలనుకున్నాను. బ్రాడ్ బౌలింగ్ వేశాడు. నేను భిన్న రీతుల్లో ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాను. చివరి బంతి కూడా సిక్స్ వెళుతుందని ఊహించలేదు. కానీ ఆ బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపించానని” యువరాజ్ పేర్కొన్నాడు.
ఇక 2007లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ దిమిత్రి మస్కరైనాస్ యువరాజ్ సింగ్ బౌలింగ్ లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టాడు. అప్పుడే నేను ఇంగ్లాండ్ జట్టుకు గట్టి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో అందుకు సరైన సమయం వచ్చింది. సెమీఫైనల్ మ్యాచ్ ముందు యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై తన ప్రతాపాన్ని చూపించాడు. దీనికి తోడు ఆ మ్యాచ్లో అండ్రూ ప్లింటాఫ్ యువరాజ్ సింగ్ ను మాటలతో కవ్వించాడు. దీంతో పట్టరాని ఆగ్రహంతో యువరాజ్ ఊగిపోయాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన స్టువర్టు బ్రాడ్ కు చుక్కలు చూపించాడు. ఏకంగా ఆరు సిక్సర్లు ఒకదాని తర్వాత ఒకటి బాది.. తన ప్రతీకారం తీర్చుకున్నాడు.. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. టి20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.