Yashasvi Jaiswal: పడి లేచిన కెరటం లాగా ఐపీఎల్లో సత్తా చాటుతుందని భావించిన ముంబై జట్టు.. మళ్లీ ఓటముల దారిలో పయనిస్తోంది. రెండు వరస విజయాలు సాధించిన వెంటనే ఆ జట్టు ఆటగాళ్లల్లో ఉత్సాహం నీరుగారిపోయినట్టుంది. ఫలితంగా వరుస ఓటములను చవిచూస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. తొమ్మిది వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటింగ్ లో ముఖ్య ఆటగాళ్లు దారుణమైన ఆట తీరు ప్రదర్శించారు. బౌలింగ్ విభాగంలోనూ అదే తీరును కొనసాగించారు. దీంతో ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలను అత్యంత కష్టతరం చేసుకుంది.
ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు బౌలర్లను రాజస్థాన్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఒక ఆట ఆడుకున్నాడు. బుమ్రా నుంచి మొదలు పెడితే పీయూష్ చావ్లా వరకు ఎవరినీ వదలలేదు. అందరి బౌలింగ్ లో అద్భుతంగా ఆడాడు. సూపర్ సెంచరీ తో టచ్ లోకి వచ్చాడు. టి20 వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపికలు జరుగుతున్న క్రమంలో అతడు సెంచరీ చేయడంతో.. సెలెక్టర్ల దృష్టిలోకి వెళ్లిపోయాడు. సెంచరీ మాత్రమే కాదు ఐపిఎల్ లో తన పేరు మీద మరో అరుదైన ఘనతను లిఖించుకున్నాడు.
వాస్తవానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు యశస్వి జైస్వాల్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ, ఈ సీజన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అతడి నుంచి గట్టి ఇన్నింగ్స్ నమోదు కాలేదు. అక్కడిదాకా ఎందుకు ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ ముందు వరకు అతడి నుంచి ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు కాలేదు. కానీ, ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం సరికొత్త ఆట తీరు ప్రదర్శించాడు. భయం అనేది పక్కనపెట్టి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 59 బంతుల్లో సెంచరీ కొట్టి.. మొత్తంగా 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అంతేకాదు రాజస్థాన్ జట్టుకు 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ ద్వారా యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ శతకాలు బాదిన యువ ఆటగాడిగా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 22 సంవత్సరాల యశస్వి.. తన ఐపీఎల్ కెరియర్లో రెండు సెంచరీలు కొట్టాడు. అతి చిన్న వయసులో ఎక్కువ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా జైస్వాల్ వినతి కెక్కాడు. ఈ సెంచరీ తో ఫామ్ లోకి వచ్చిన జైస్వాల్.. తన ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నాడు. వాస్తవానికి ముంబై జట్టు విధించిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. రాజస్థాన్ ఓపెనర్లు ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లకు వికెట్లు తీసే అవకాశం ఇవ్వకుండా చక చకా పరుగులు తీశారు. ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 రన్స్ చేసింది. తిలక్ వర్మ 65 పరుగులతో ఆకట్టుకున్నాడు. నేహళ్ వదేర 49 పరుగులతో సత్తా చాటాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. 180 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు మంచినీళ్లు తాగినంత సులభంగా విజయం సాధించింది. కేవలం 18.4 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది.