Homeక్రీడలుWTC Final 2023: సమరానికి వేళాయే..! విజయం ఎవరిని వరించేనో..?

WTC Final 2023: సమరానికి వేళాయే..! విజయం ఎవరిని వరించేనో..?

WTC Final 2023: భారత్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో బుధవారం నుంచి ఈ నెల 11 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన తొలి ఫైనల్ మ్యాచ్లో అనూహ్య ఓటమితో భారత జట్టు టైటిల్ కైవసం చేసుకోలేకపోయింది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైన తర్వాత రెండోసారి ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. ఇందుకోసం బలమైన జట్టుతో బరిలోకి దిగాలని భారత జట్టు భావిస్తోంది. అయితే, ఓవల్ మైదానంలో పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి చూస్తే తుది జట్టు ఎంపిక విషయంలో టీమ్ మేనేజ్మెంట్ లో సందిగ్ధత కొనసాగుతోంది.

భరత్ కు అవకాశం దక్కేనా..?

ఆడిన ఆఖరి టెస్టులో తుది జట్టును పరిశీలిస్తే ఒకటి రెండు స్థానాలు మినహా ఇతర ఆటగాళ్లు అందరికీ చోటు ఖాయంగా కనిపిస్తోంది. టాప్-4 లో రోహిత్ శర్మ, గిల్, పుజారా, కోహ్లీ ఉండగా.. శ్రేయాస్ అయ్యర్ లేకపోవడంతో ఐదో స్థానంలో రహానే ఆడనున్నాడు. ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.

అశ్విన్ స్థానంపై హామీ ఇవ్వని రోహిత్ శర్మ..

ఓవల్ మైదానాన్ని బట్టి చూస్తే భారత్ నలుగురు పేసర్లతో ఆడుతుందా..? రెండో స్పిన్నర్ కు అవకాశం దక్కుతుందా.? అన్నది చూడాల్సి ఉంది. మ్యాచ్ కు ముందు రోజు రోహిత్ శర్మ కూడా సీనియర్ బౌలర్ అశ్విన్ స్థానంపై హామీ ఇవ్వలేకపోయాడు. షమీ, సిరాజ్ తోపాటు ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఉంది. అయితే, ప్రధానంగా వికెట్ కీపర్ పైనే చర్చ కొనసాగుతోంది.

కెఎస్ భరత్ ను ఎంచుకోవాల్సిన అవసరం..

తుది జట్టులోకి కీపర్ గా ఎవరిని తీసుకోవాలి అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. కీపింగ్ నైపుణ్యాన్ని బట్టి చూస్తే ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ను ఎంచుకోవాలి. అయితే, దూకుడైన బ్యాటింగ్ తో పాటు ఎడమ చేతి వాటం కావడం ఇసాన్ కిషన్ అవకాశాలను పెంచుతోంది. అయితే, ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఆడని ఇషాన్ ను కీలక పోరులో అరంగేట్రం చేయిస్తారా..? అనేది కొంత సందేహంగా కనిపిస్తోంది. ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్లంతా టి20లోనే ఆడినా, ఆటతో టచ్ లోనే ఉన్నారు. కీలక ఆటగాడు పుజారా ఇటీవల ఆడిన కౌంటీ క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది. మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతున్న మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular