YS Jagan – Vijayasai Reddy : వైసీపీలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఇది. ఏ నాయకుడు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడో? ఎప్పుడు అలకపాన్పు ఎక్కుతారో తెలియని పరిస్థితి. గత కొద్దినెలలుగా మౌనాన్ని ఆశ్రయించిన విజయసాయిరెడ్డి సెడన్ గా తిరిగి యాక్టివ్ అయ్యారు. పార్టీలో అన్ని పదవులకు దూరం చేయడంతో ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. కనీసం తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా కనిపించలేదు. దీంతో వైసీపీకి దూరమవుతారని ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టే ఆయన చర్యలన్నీ సాగేవి. అయితే ఉన్నట్టుండి ఆయన్ను మళ్లీ జగన్ పిలిచినట్టుంది. ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు అదే కారణమవుతోంది.
ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఒకవిధంగా చెప్పాలంటే నార్త్ ఆంధ్రాకు సీఎంగా మెలిగారు. అదే స్థాయిలో అవినీతి ఆరోపణలను మూటగట్టుకున్నారు. సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో హైకమాండ్ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. ఉత్తరాంధ్ర రీజనల్ బాధ్యతలను తప్పించింది. అక్కడితే ఆగకుండా సోషల్ మీడియా బాధ్యతలను సైతం లాగేసుకుంది. సజ్జల కుమారుడికి అప్పగించింది. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలను లాగేసుకొని చెవిరెడ్డికి అప్పగించింది. దీంతో పార్టీ కార్యకలాపాలను సైడ్ చేసుకున్న విజయసాయి ఢిల్లీకే పరిమితమైపోయారు.
ఒక్కసారిగా మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయసాయి కనిపించేసరికి పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అలా వచ్చీ రాగానే వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతలు తీసుకోవడంతో పాటు ఏకంగాఅనుబంధ విభాగాల సమావేశం నిర్వహించడం విశేషం. గత కొద్దినెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండడం, ప్రత్యర్థులతో విమర్శలు చేయకపోగా, ఆయా సందర్భాల్లో వారితో సానుకూలంగా వ్యవహరించడం తదితర కారణాలతో వైసీపీకి దూరమవుతారనే చర్చ నడిచింది. ఇప్పుడు జగనే పిలిచి వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జితో పాటు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బాధ్యతల్నిఅప్పగించడంతో ఎక్కడో తేడా కొడుతున్నట్టు కనిపిస్తోంది.
విజయసాయిరెడ్డి కొంత కాలం మౌనాన్ని ఆశ్రయించడంతో ఆయన బాధ్యతలు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా జరిగాయి. రాష్ట్రస్థాయిలో తనకు తోడుగా వుండాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు, చంద్రగిరిని కుమారుడు మోహిత్‌రెడ్డికి అప్పగించినట్టు ఇటీవల ఆయన ప్రకటించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి యాక్టీవ్ కావడంతో చెవిరెడ్డి కర్తవ్య నిర్వహణ ఏంటనేది తేలాల్సి వుంది. ఇప్పుడు జగన్ టీమ్ లోకి విజయసాయిరెడ్డి తిరిగి చేరడం కూడా చర్చనీయాంశంగా మారుతోంది. దూరం చేసుకున్న వ్యక్తిని మళ్లీ చేరదీయం ఏంటన్నది తెలియాల్సి ఉంది. కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.