https://oktelugu.com/

WPL 2024: బెంగళూరు విజయం.. డ్యాన్స్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్

ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం బెంగళూరు జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. డగ్ అవుట్ నుంచి బయటికి వచ్చి డ్యాన్సులు చేశారు. ఒకరిని ఒకరు హత్తుకొని సంబరాల్లో మునిగిపోయారు.

Written By: , Updated On : March 18, 2024 / 11:39 AM IST
WPL 2024

WPL 2024

Follow us on

WPL 2024: ఉమెన్స్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో రెండవ సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది. ఢిల్లీ జట్టు పై జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండవ సీజన్లో సరికొత్త విజేతగా బెంగళూరు జట్టు ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు మాత్రమే కాకుండా.. కర్ణాటక వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కెప్టెన్ స్మృతి మందానను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో బెంగళూరు జట్టు సాధించిన విజయానికి సంబంధించిన యాష్ ట్యాగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఉమెన్స్ సీజన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లో బెంగళూరు జట్టు ఆశించినంత స్థాయిలో ప్రతిభ చూపలేదు. ఇక ఐపీఎల్ 2018లో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు బెంగళూరు జట్టు ఒక్క కప్ కూడా అందుకోలేదు. కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్నప్పటికీ ఆ జట్టు ఆశించినంత స్థాయిలో ప్రతిభ చూపడం లేదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ కప్ దక్కించుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం బెంగళూరు జట్టు ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. డగ్ అవుట్ నుంచి బయటికి వచ్చి డ్యాన్సులు చేశారు. ఒకరిని ఒకరు హత్తుకొని సంబరాల్లో మునిగిపోయారు. ఎలీస్ ఫెర్రీని అమాంతం ఎత్తుకొని కేరింతలు కొట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే..

బెంగళూరు జట్టుకు ప్రారంభించి ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు మహిళల జట్టు విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు గానీ.. బెంగళూరు జట్టుకు చెందిన ఓ కీలక వ్యక్తి వీడియో కాల్ చేయడంతో అందులో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియోలో వైట్ నెక్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్న కోహ్లీ.. బెంగళూరు మహిళా ఆటగాళ్లను అభినందిస్తూ.. వారి ఆట తనకు మజా ఇచ్చిందనేదానికి సంకేతంగా చేతులు పైకి ఊపుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మ్యాచ్ గెలిచిన అనంతరం.. విరాట్ కోహ్లీ వీడియో కాల్ ద్వారా ఆటగాళ్లను అభినందించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహిళల జట్టు మాదిరిగానే ఈసారి ఐపీఎల్లో పురుషుల జట్టు కప్ దక్కించుకోవాలని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. చాలామంది విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తున్నారు.