IND vs SL 3 ODI : టి20 సిరీస్ అత్యంత సులువుగా టీమ్ ఇండియా గెలుచుకుంది. 3-0 తేడాతో శ్రీలంకను మట్టి కరిపించింది. ఇదే జోరును వన్డే సిరీస్ లోనూ టీమిండియా కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు. పైగా అనుభవజ్ఞుడైన రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా సత్తా చాటుతుందని అందరూ భావించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు. ఎందుకంటే ఆతిధ్య శ్రీలంక టీమిండియా కు చుక్కలు చూపిస్తోంది. టీమిండియా గెలవాల్సిన తొలి వన్డే టై అయింది. రెండవ వన్డే మిడిల్ ఆర్డర్ లోపం వల్ల ఓడిపోయింది. దీంతో టీమ్ ఇండియా బుధవారం చివరిదైనా మూడవ వన్డే ఆడనుంది. నెమ్మది మైదానాలు, బంతులను మెలికలు తిప్పే శ్రీలంక స్పిన్నర్ ల నుంచి టీమిండియా అనూహ్య ప్రతిఘటన ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో విజయం సాధించాలని, సిరీస్ సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు 2-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని, పొట్టి ఫార్మాట్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. చివరగా 1997లో అర్జున రణతంగా నాయకత్వంలో శ్రీలంక జట్టు 3-0 తేడాతో భారత జట్టును మట్టికరిపించింది. ఆ తర్వాత పలు ప్రాంతాలలో జరిగిన 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్ లలో శ్రీలంకపై భారత్ పై చేయి సాధించింది.
టి20 ప్రపంచ కప్ లో భారత జట్టును విజేతగా నిలిపిన రోహిత్, చీఫ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటన ద్వారా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. యువ ఆటగాళ్లు t20 సిరీస్ ను 3-0 తేడాతో దక్కించుకున్నారు. వన్డే వరకు వచ్చేసరికి ఆ స్థాయిలో టీమిండియా ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది. ముఖ్యంగా తొలి వన్డేలో 14 బంతులు ఉన్నప్పటికీ ఒక్క పరుగు చేయలేక భారత విఫలమైంది. రెండవ వన్డేలో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. వాస్తవానికి ఈ రెండు మ్యాచ్లలో రోహిత్ మైదానంలో ఉన్నంతవరకు జట్టు గెలుస్తుందనే భావన అందరిలో ఉంది. ఎప్పుడైతే రోహిత్ అవుట్ అవుతున్నాడో.. అప్పుడే జట్టు కుప్పకూలిపోతున్నది.
పవర్ ప్లే ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాడు. గట్టి ఆరంభాలు ఇస్తున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోతున్నారు. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (24, 14), కేఎల్ రాహుల్ (31, 0), శ్రేయస్ అయ్యర్ (23, 7) రెండో మ్యాచ్లో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వీరు ముగ్గురు వెంట వెంటనే అవుట్ కావడంతో రెండవ వన్డేలో జట్టు విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఇక మూడవ వన్డేలో శ్రీలంక స్పిన్ అస్త్రాన్ని గట్టిగా అడ్డుకోవాలంటే అయ్యర్, విరాట్, రాహుల్ అత్యంత సమర్థవంతంగా ఆడాలి. తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయాలి. మిడిల్ ఆర్డర్ అత్యంత బలంగా మారాలి. శ్రీలంక స్పిన్ బౌలింగ్ ను ధాటిగా ఎదుర్కోవాలి. ధారాళంగా పరుగులు రాబట్టాలి. అయితే బౌలింగ్ విషయంలో భారత జట్టుకు ఎటువంటి ఆందోళన లేకపోయినప్పటికీ.. శివం దుబే స్థానంలో స్పిన్ వేయగలిగే రియాన్ పరాగ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీలంక ఎటువంటి మార్పులు లేకుండానే మూడవ వన్డేలో బరిలోకి దిగుతున్నట్టు సమాచారం.
జట్ల అంచనా ఇలా
భారత్ :
రోహిత్ శర్మ (కెప్టెన్), అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ, కులదీప్ యాదవ్, శివం దూబే/ రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్.
శ్రీలంక:
చరిత్ అసలంక (కెప్టెన్), నిశాంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమర విక్రమ, లియనాగే, వెల్ల లాగె, కమిందు మెండీస్, ధనుంజయ, వాండర్సే, ఆసిత్ ఫెర్నాండో.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: Will india win third odi real test for rohit gautam gambhir