West Indies Vs Australia: టి20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా జట్టు ఉంది. అయితే ఈ జట్టుకు అంత సీన్ లేదని.. మా దేశంలో కంగారుల పప్పులు ఉడకవని వెస్టిండీస్ తేల్చి చెప్పేసింది. టి20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ చుక్కలు చూపించింది. శుక్రవారం క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో.. ఆస్ట్రేలియా జట్టును 35 పరుగుల తేడాతో వెస్టిండీస్ మట్టి కరిపించింది. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ తన విశ్వరూపం చూపించాడు. సిక్స్ ల మీద సిక్స్ లు కొట్టి మైదానంలో సునామీ సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్ లతో 75 పరుగులు చేశాడు. అతడు ఆడుతున్నంతసేపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్లో రెండు జట్లు భారీ స్కోరు నమోదు చేశాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు భీకరమైన ఇన్నింగ్స్ ఆడింది. నికోలస్ పూరన్ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తే.. వెస్టిండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ మరింత రెచ్చిపోయాడు. అతడు 25 బంతుల్లో ఏకంగా 52 పరుగులు చేశాడు.. చార్లెస్ 40, రూథర్ఫోర్డ్ 47 రన్స్ చేసి అదరగొట్టారు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది.. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆస్ట్రేలియా కూడా దీటుగానే బ్యాటింగ్ చేసింది. చివరి వరకు పోరాడింది. 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లల్లో జోష్ ఇంగ్లీష్ 55, నాథన్ ఎల్లిస్ 39 రన్స్ చేసి ఆకట్టుకున్నారు.. ప్రాక్టీస్ మ్యాచ్ అయినప్పటికీ వెస్టిండీస్ ఆటగాళ్లు బీభత్సంగా బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపారు. ఈ ప్రపంచ కప్ లో తాము అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లమో సంకేతాలు విధిల్చారు.
వాస్తవానికి క్వీన్స్ ఓవల్ పార్క్ బౌలర్లకు స్వర్గధామం లాగా ఉంటుంది. అయితే ఈ మైదానంపై వెస్టిండీస్ ఆటగాళ్లు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా పూరన్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం పట్ల క్రీడా విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్, సునామి ఒకేసారి విరుచుకు పడితే ఎలా ఉంటుందో.. అలా అతడు బ్యాటింగ్ చేశాడని కొనియాడుతున్నారు. ప్రత్యర్థి జట్లు ముందుగానే అతడిని కట్టడి చేస్తేనే వెస్టిండీస్ జట్టును ఓడించవచ్చని.. లేకుంటే కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.