T20 World Cup 2024: మరి కొద్ది రోజుల్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా అమెరికా వెళ్లిపోయింది. అక్కడ ముమ్మరంగా సాధన చేస్తోంది. జూన్ రెండు నుంచి టి20 వరల్డ్ కప్ టోర్నీ మొదలుకానుంది. 2007 ప్రారంభ సీజన్లో భారత జట్టు టి20 వరల్డ్ కప్ సాధించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా మరొక కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినప్పటికీ కీలక మ్యాచ్లలో ఓడిపోవడంతో.. ఇంటి దారి పడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని టీమిండియా భావిస్తోంది. రోహిత్ శర్మకు కెప్టెన్ గా చివరిది కావడం, కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఈ వరల్డ్ కప్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఈసారి ప్లే – 11 జట్టులో ఎవరుంటే బాగుంటుందనే దానిపై ప్రత్యేక కథనం.
రోహిత్ శర్మ
ఇటీవలి ఐపీఎల్ లో రోహిత్ శర్మ ఆశించినంత స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాడు.. ఒక సెంచరీ కొట్టినప్పటికీ.. అతని నుంచి ముంబై అంతకంటే ఎక్కువ ఆశించింది.. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియా కెప్టెన్ మరింత సత్తా చాటాల్సి ఉంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ 151 టి-20 మ్యాచ్ లు ఆడాడు. 143 ఇన్నింగ్స్ లలో 3,974 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 121*.. కెరియర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో.. రోహిత్ ఈసారి మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
యశస్వి జైస్వాల్
ఈ యువ సంచలనం ఐపీఎల్ లో విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ జట్టు తరఫున 16 మ్యాచులు ఆడి.. 435 పరుగులు చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 105*. ఇక అంతర్జాతీయ టి20 మ్యాచ్ల పరంగా చూసుకుంటే .. ఇప్పటివరకు 17 మ్యాచులు ఆడి, 502 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 100.. ఓపెనర్ గా మెరుగైన ఆరంభం అందించే ఆటగాడిగా యశస్వి పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లాగానే జోరు చూపిస్తే టీమిండియా కు ఇక తిరుగు ఉండదు.
విరాట్ కోహ్లీ
ఈ ఐపీఎల్లో 15 మ్యాచ్లు ఆడి.. 741 రన్స్ చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీ, ఐదు అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో అతని హైయెస్ట్ స్కోరు 113*. టి20 కెరియర్ ప్రకారం చూసుకుంటే 117 టి20 మ్యాచ్ లు ఆడి, 4,037 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 122* . విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో మాదిరి బ్యాటింగ్ చేస్తే టీమిండియా కు ఎదురు ఉండదు.
సూర్య కుమార్ యాదవ్
స్పోర్ట్స్ హెర్నియా చికిత్స పొంది.. కొద్దిరోజులపాటు నేషనల్ క్రికెట్ అకాడమీకి పరిమితమైన సూర్య కుమార్ యాదవ్.. ఐపీఎల్ లో 11 మ్యాచులు ఆడి 345 పరుగులు చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 102*. టి20 కెరియర్ పరంగా 60 మ్యాచ్లు ఆడి, 2,141 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 117. సూర్య కుమార్ యాదవ్ తనదైన రోజున దాటిగా బ్యాటింగ్ చేయగలడు. కాకపోతే స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడమే అతడిలో ఉన్న ప్రధాన లోపం. దానిని గనుక అధిగమిస్తే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా భారీగా పరుగులు సాధించే అవకాశం ఉంటుంది.
రిషబ్ పంత్
రోడ్డు ప్రమాదానికి గురై, దాదాపు రెండు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమైపోయాడు రిషబ్ పంత్. ఐపీఎల్ ద్వారా క్రికెట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ కెప్టెన్ గా పర్వాలేదనిపించాడు. ఐపీఎల్ లో 13 మ్యాచ్లు ఆడి, 446 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 88*. టి20 కెరియర్ పరంగా 66 మ్యాచులు ఆడి.. 987 రన్స్ చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 65*. వికెట్ కీపింగ్ లో రిషబ్ మెరుగ్గా ఉంటాడు. అయితే స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేకపోవడం ఇతడికి అతిపెద్ద మైనస్ పాయింట్. దానిని కనుక సరి చేసుకుంటే టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం అయినట్టే.
సంజు శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో అదరగొట్టాడు. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన, జట్టు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ లో 16 మ్యాచులు ఆడి 531 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 86. ఇక అంతర్జాతీయ టి20 కెరియర్ ప్రకారం చూసుకుంటే 25 మ్యాచ్లు ఆడిన సంజు, 374 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 77. ఐపీఎల్ మాదిరి సంజు అదరగొడితే తిరుగు ఉండదు. అటు పాస్ట్, ఇటు స్పిన్ బౌలింగ్ లో సంజు అదిరిపోయేలాగా బ్యాటింగ్ చేశాడు. రిషబ్ తో పోల్చితే స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడం సంజుకు ప్రధాన బలం.
హార్దిక్ పాండ్యా
ఐపీఎల్ లో 2022లో గుజరాత్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు హార్దిక్ పాండ్యా. గత ఏడాది ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈ ఏడాది ముంబై జట్టు కెప్టెన్ గా రాణించలేకపోయాడు.. ఇతడు నాయకత్వంలో లీగ్ దశలోనే ముంబై జట్టు వెనక్కి వచ్చేసింది . ఐపీఎల్ లో 14 మ్యాచ్లు ఆడి 216 పరుగులు చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోరు 46. ఇక బౌలింగ్లో 14 మ్యాచ్లు ఆడి, 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 31/3. ఇక అంతర్జాతీయ టి20 మ్యాచ్ల పరంగా చూసుకుంటే 92 మ్యాచ్లు ఆడి 1,348 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోరు 74*. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో లయ లోపించింది. బ్యాటింగ్లో ఆ సత్తా కరువైంది. అందువల్లే అతడు ఐపీఎల్లో తేలిపోయాడు. ఇక టి20 వరల్డ్ కప్ లో అతడు తన మునుపటి ఫామ్ అందుకోవాల్సి ఉంది.
శివం దుబే
శివం దుబే ఐపీఎల్లో 14 మ్యాచులు ఆడి 396 రన్స్ చేశాడు. ఇందులో అతని హైయెస్ట్ స్కోర్ 66*. ఇక టి20 మ్యాచ్ లు పరంగా చూసుకుంటే 21 మ్యాచులు ఆడి 276 రన్స్ చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 63*. ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడిన శివం దుబే.. కొన్ని మ్యాచ్లలో మెరిశాడు.. కీలకమైన మ్యాచులలో తేలిపోయాడు. టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్న నేపథ్యంలో.. శివం దుబే స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. జట్టు అవసరాల దృష్ట్యా శివం దుబేను మిడిల్ ఆర్డర్లో ఆడించే అవకాశం ఉంది. అలాంటప్పుడు మెరుగ్గా ఆడితేనే శివం స్థానానికి భరోసా ఉంటుంది.
రవీంద్ర జడేజా
ఐపీఎల్ లో చెన్నై తరఫున ఆడిన ఈ ఆటగాడు.. 14 మ్యాచ్లలో 267 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 57*. ఇక బౌలింగ్లో 14 మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 18/3 ఇతడి అత్యుత్తమ ప్రదర్శన. ఇక అంతర్జాతీయ టి20 చూసుకుంటే 66 మ్యాచులు ఆడి 48 రన్స్ చేశాడు. ఇతడి అత్యుత్తమ స్కోరు 46*. బౌలింగ్లో 53 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 3/15.
అక్షర్ పటేల్
ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్లో ఇతడు రాణించగలడు.. ఐపీఎల్ లో 14 మ్యాచులు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 2/52. బ్యాటింగ్ లో 235 రన్స్ చేశాడు. ఇతడి హైయెస్ట్ స్కోర్ 66. అంతర్జాతీయ టి – 20 మ్యాచ్ల పరంగా చూసుకుంటే 52 మ్యాచులు ఆడి.. 361 రన్స్ చేశాడు. ఇందులో ఇతడి హైయెస్ట్ స్కోర్ 65. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే 52 మ్యాచులు ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 3/9. అక్షర్ పటేల్ వైవిధ్యవంతమైన బంతులు వేయడంలో నేర్పరి. అటు బ్యాటింగ్ కూడా మెరుగ్గా చేయగలడు. టి20 వరల్డ్ కప్ లో తన ప్రతిభకు మరింత పదును పెడితే భారత్ భారీ స్కోరును, వికెట్లనూ సాధించడం ఖాయం.
కులదీప్ యాదవ్
చైనా మన్ గా ప్రసిద్ధి పొందిన ఈ బౌలర్ అత్యుత్తమంగా బౌలింగ్ చేయగలడు. తనదైన రోజు మ్యాజిక్ చేయగలడు. ఐపీఎల్ లో 11 మ్యాచులు ఆడి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 55/4. ఇక అంతర్జాతీయ టి20 మ్యాచ్ల విషయానికొస్తే 35 మ్యాచ్లు ఆడి 59 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 5/17.
యజు వేంద్ర చాహల్
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను ఇతడు సొంతం చేసుకున్నాడు.. తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేయడం లో ఇతడు నేర్పరి. ఇటీవలి ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంటర్నేషనల్ టి20 కెరియర్ విషయానికొస్తే 80 మ్యాచులు ఆడి 96 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 6/25.
అర్ష్ దీప్ సింగ్
ఇటీవలి ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్లు ఆడి, 19 వికెట్లు పడగొట్టాడు. వేగవంతమైన బంతులు వేస్తూ.. వికెట్లు పడగొట్టడంలో ఇతడు సిద్ధహస్తుడు. అంతర్జాతీయ టి20 కెరియర్ విషయానికొస్తే.. 43 మ్యాచ్లు ఆడి 62 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 43/2.
జస్ ప్రీత్ బుమ్రా
భారత జట్టు పేసు గుర్రంగా ఇతడు నేర్పరి. వేగంగా బౌలింగ్ వేస్తూ.. వికెట్లను పడగొడతాడు. ఐపీఎల్ లో 13 మ్యాచ్ లు ఆడి, 20 వికెట్లు పడగొట్టాడు.. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 21/5. అంతర్జాతీయ టి20 కెరియర్ విషయానికి వస్తే 62 మ్యాచులు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 3/11.
మహమ్మద్ సిరాజ్
టీమిండియాలో అత్యంత వేగంగా వెలుగులోకి వచ్చిన ఆటగాడు ఇతడు.. అయితే స్థిరంగా బౌలింగ్ వేయడంలో ఇటీవల విఫలమవుతున్నాడు. ఐపీఎల్ విషయానికి వస్తే 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 43/3. అంతర్జాతీయ టి20 కెరియర్ విషయానికొస్తే.. పది మ్యాచ్లు ఆడి 12 వికెట్ల పడగొట్టాడు. ఇతడి అత్యుత్తమ ప్రదర్శన 4/17.