https://oktelugu.com/

Renuka Swamy Case: రేణుకా స్వామి హత్యకు ముందు.. దర్శన్ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే

Renuka Swamy Case: దర్శన్ వ్యవహార శైలి జీర్ణించుకోలేని అతడి అభిమాని రేణుకా స్వామి పవిత్ర గౌడ కు ఇన్ స్టా గ్రామ్ లో బెదిరింపు సందేశాలు పంపాడు. కొన్ని అశ్లీల వీడియోలు కూడా సెండ్ చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 18, 2024 / 11:45 AM IST

    Actor Darshan And Other Accused Torture Renuka Swamy

    Follow us on

    Renuka Swamy Case: పవిత్ర గౌడ మోజులో పడి కన్నడ హీరో దర్శన్ అనేక దారుణాలకు ఒడిగట్టాడు.. రేణుకా స్వామి హత్య తర్వాత ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. పవిత్ర గౌడ కంటే ముందే దర్శన్ కు విజయలక్ష్మి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహమైనప్పటికీ పలువురు హీరోయిన్లతో దర్శన్ సాన్నిహిత్య సంబంధాలు నడిపాడని కన్నడ సినిమా వర్గాల్లో అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. సహజంగానే దూకుడు స్వభావం ఉన్న దర్శన్ ఎవరినీ లెక్కపెట్టేవాడు కాదట. చివరికి తోటి నటీనటులకు కూడా గౌరవం ఇచ్చేవాడు కాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పవిత్రతో సంబంధం ఏర్పడటంతో విజయలక్ష్మిని దూరం పెట్టాడు. పవిత్రతోనే కలిసి ఉండటం మొదలుపెట్టాడు.. దర్శన్ వ్యవహార శైలి జీర్ణించుకోలేని అతడి అభిమాని రేణుకా స్వామి పవిత్ర గౌడ కు ఇన్ స్టా గ్రామ్ లో బెదిరింపు సందేశాలు పంపాడు. కొన్ని అశ్లీల వీడియోలు కూడా సెండ్ చేశాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకురావడంతో.. అతడు తోక తొక్కిన తాచులాగా లేచాడు. వెంటనే తన సన్నిహితుడు రాఘవేంద్ర ద్వారా రేణుకా స్వామిని తన దగ్గరికి పిలిపించుకున్నాడు.

    దర్శన్, పవిత్ర గౌడ, ఇతరులు రేణుకా స్వామిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. హత్య చేసే ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చారు. చిత్రహింసలకు గురి చేశారు.. ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ విషయాన్ని పోలీసుల ఎదుట కేబుల్ వర్కర్ ధనరాజ్ పేర్కొన్నాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. రేణుకా స్వామి శరీరంపై 39 గాయాలున్నాయి. ఇందులో ఏడు చోట్ల అత్యంత దారుణమైన కాలిన గాయాలున్నాయి. అతడు వద్దూ, నన్ను కొట్టకండి అని ప్రాధేయపడుతున్నప్పటికీ దర్శన్, పవిత్ర గౌడ వినిపించుకోలేదట. విపరీతంగా కొట్టారట.

    రేణుకా స్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. ఒక డ్రైనేజీలో అతని మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత దర్శన్ కోపంతో పవిత్ర గౌడపై చేయి చేసుకున్నాడు. నీవల్లే ఇదంతా జరిగిందని అరిచాడు.. విషయం వెలుగులోకి రావడంతో దర్శన్, పవిత్ర గౌడ, ఈ హత్యలో ప్రమేయం ఉన్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో రోజుకో తీరుగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు దర్శన్ ఉదంతం నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ స్పందించారు. ” రేణుకా స్వామి గర్భవతి. ఆమె కడుపులో పసి గుడ్డు కు ఆలంబన దక్కాలి. ఈ హత్యలో ఎవరి పాత్ర ఎంత ఉందో పోలీసులు బయటకి చెబుతారు. ఆ నిందితులు కచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఇలాంటి ఘటనల వల్ల కచ్చితంగా కన్నడ సినిమా పరిశ్రమపై ఒత్తిడి ఉంటుంది. అయితే దానిని ఎలా అధిగమించాలనేది సినీ పరిశ్రమ పెద్దలు తదుపరి నిర్ణయం తీసుకుంటారని” సుదీప్ వ్యాఖ్యానించారు.