Women’s T20 World Cup PAK VS BAN : పాకిస్తాన్ జట్టుపై సాధించిన విజయం ద్వారా టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్ లో ఏకంగా బంగ్లాదేశ్ తొలిసారిగా నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లాండ్ జట్టును సైతం పక్కనపెట్టి న్యూజిలాండ్ తర్వాత స్థానంలో నిలిచింది. పురుషుల జట్టు పరిస్థితి అలా ఉంటే.. మహిళల జట్టు పరిస్థితి మరో విధంగా ఉంది. మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా వార్మప్ మ్యాచ్ లను ఐసీసీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టు బంగ్లాదేశ్ మహిళల జట్టుతో దుబాయ్ వేదికగా మంగళవారం తలపడింది. ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ పురుషుల జట్టునే మహిళల జట్టు కూడా అనుసరించింది. బంగ్లాదేశ్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫస్ట్ బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 140 రన్స్ స్కోర్ చేసింది. షోర్నా అక్తర్ 28, ఓపెనర్ శాంతి రాణి 23 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. నైగర్ సుల్తానా (18), తాజ్ నహర్(17) పరుగులు చేసి ఆకట్టుకున్నారు. చివర్లో రీతు మోని 8 బంతుల్లో 14 పరుగులు చేసి ఆకట్టుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో సాదియా ఇక్బాల్ రెండు వికెట్లు పడగొట్టింది. ఫాతిమా సనా, డయానా బేగ్, నిదా ధార్, తూబా హసన్, ఓమైమా సోహైల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 141 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 18.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. పాకిస్తాన్ జట్టులో ఓమైమా సోహైల్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.. ఫాతిమా సనా(17), గుల్ ఫిరోజా(17), నిదా ధార్(14) పరుగులు చేశారు. ఇరామ్ జాయేద్(0) గోల్డెన్ డక్ గా వెనుదిరిగింది. సదాఫ్(1), తుబా హసన్(1), సయ్యదా రూబ్ షా(1) ఇలా వెంట వెంటనే అవుట్ కావడంతో పాకిస్తాన్ జట్టు 117 పరుగులు మాత్రమే చేసింది.. నిన్న పురుషుల జట్టు చేతులో .. నేడు మహిళల జట్టు చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని.. బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ జట్టు భయపడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఈ విజయం నేపథ్యంలో బంగ్లాదేశ్ మహిళల జట్టు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ జట్టులో మరుఫా అక్తర్, ఫాహిమా, రాబేయా ఖాన్, షోర్నా అఖ్తర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. నహిదా అఖ్తర్ ఒక వికెట్ దక్కించుకుంది.